17-09-2025 12:00:00 AM
పాలకుర్తి రామమూర్తి :
దైవం మానుషం వా ప్రకృతి వ్యసనమ్
అనయాపనయాభ్యాం సంభవతి..
(కౌటిలీయం 8--1)
ప్రతీ వ్యక్తి జీవితంలో ఉన్నతత్వాన్ని సాధించాలని, సంపదను, యశస్సునూ పొందాలని భావించడం సహజమే. ఆ ప్రయత్నంలో ముందుకు సాగే క్రమంలో.. వ్యక్తిగత జీవనంలో లేదా వ్యాపార నిర్వహణలో లేదా ప్రభుత్వ నిర్వహణలో కార్యరం గమేదైనా అపాయాలు పలకరించవచ్చు. అవి అతివృష్టి, అనావృష్టి, వరదలు రావడం, దావానలాలు, భూకంపాలు లాంటి ప్రాకృతికమైన ఆపదలు కావచ్చు లేదా మానవ తప్పిదాలూ కావచ్చు. సమస్యలెలాంటివైనా, వాటిని నిర్వహించుకునే నాయకుని నిర్వహణా దక్షతపై దేశ/సంస్థ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
ఆదిలోనే తుంచేయాలి
అధికార లాలసత కలిగిన అసమర్ధ నాయకుని తప్పుడు నిర్ణయాలు సంస్థను నష్టాల ఊబిలోకి దింపుతాయి. అలాగే ఉ త్సాహం కలిగిన నిర్వాహకులకు సంబంధి త రంగంలో నూతనంగా జరుగుతున్న ఆవిష్కరణలపై శిక్షణనందించడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. ఎక్కువ పని ఒత్తిడి ఉండే నిర్వాహకుడు కొంత వి శ్రాంతి తీసుకుంటే.. అతని పని సామర్ధ్యం పెరుగుతుంది. అయితే అవసరానికి మిం చిన విశ్రాంతి స్తబ్ధతనిస్తుంది.
ఒక సంస్థ ఉ న్నతాధికారి నెలరోజుల సెలవు యాత్రలో గడిపి వచ్చాక అతని తెలివితేటల కొలమానం (ఐక్యూ) 20 శాతం తగ్గిందని ఒక సర్వే చెపుతున్నది. అలాగే మాదక ద్రవ్యాలకు, లంచాలకు, వ్యభిచారాదులకు అల వాటుపడడం లాంటివి నిర్వాహకుని సా మర్ధ్యాన్ని తగ్గించడమే కాక సంస్థను అప్రతిష్ఠ పాలుచేస్తాయి. తోటివారిని చిన్న చూపు చూచే నిర్వాహకుని అహంకారం సంస్థను నిర్వీర్యం చేస్తుంది. ఇవన్నీ మా నవ తప్పిదాలు. ఇలాంటి లక్షణాలను ఆదిలోనే గమనించి తుంచివేయడం ఉత్తమం.
ఉత్తమ అధికారిగా
ఒకప్పుడొక ఉద్యోగి సంస్థ డబ్బును జూదమాడి పోగొట్టుకున్నాడు. న్యాయం గా అతనిని ఉద్యోగం నుంచి తొలగించాలి.. కాని అతనికి సంస్థ మరొక అవకాశ మిచ్చి అంతకన్నా ఉన్నత బాధ్యతను అప్పగించింది. దానితో తప్పును తెలుసుకున్న ఉద్యోగి తన శక్తియుక్తులను వినియోగించి, నిబద్ధతతో అనుకున్న సమయానికి ముం దుగా ఆ బాధ్యతను నిర్వహించాడు. అప్పుడప్పుడు తప్పులు జరగవచ్చు కాని తప్పు లు సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వడం వల్ల ఉద్యోగికీ, సంస్థకూ మేలు జరుగుతుంది.
ఉన్నతాధికారుల బద్ధకం బృంద సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. అలాంటి వారిని సరి దిద్దగలిగితే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు నంటున్నాడు దేవూ కంపనీ అధినేత ‘కిమ్ వూ చూంగ్’. అతని సంస్థలో ఒక నిర్వాహణాధికారి పనితీరు సంతృప్తికరంగా లేదని గమనించిన ‘కిమ్ వూ చూం గ్’ అతని పని విధానంపై ప్రతి మూడు నెలలకు ఒకమారు రెండు వందల పేజీల నివేదికను కోరేవాడట.
దాని వల్ల ఆ అధికారి తన కింది విభాగాల్లో జరుగుతున్న ప్రతి పనిని నిశితంగా పరిశీలించి సరిచూచి నివేదిక ఇవ్వవలసి వచ్చింది. దాని వల్ల క్రమం తప్పకుండా అతనన్ని విభాగాలను పర్యవేక్షిస్తూ, సరిచూచుకుం టూ బద్ధకాన్ని విడిచి పని చేయవలసి వచ్చింది. ఆ అధికారి త్వరలోనే ఉత్తమ అధికారిగా తయారయ్యాడని చెపుతారాయన.
ఎత్తుపల్లాలు సహజం
అలగ్జాండర్ అనే సైకాలజిస్ట్ బృందం ఒక పరిశోధన చేశారు. కొన్ని ఎలుకలను ఒంటరిగా, మరికొన్ని ఎలుకలను బృందంగా ఏర్పరచి వాటికి మత్తుమందు కలిపిన నీటిని అందించారట. ఒంటరి ఎలుకలు మత్తుపానీయాన్ని అధికంగా సేవించడం.. సామాజికంగా కలిసి ఉన్న ఎలుకలు మత్తుపానీయాన్ని తక్కువగా తీసుకోవడం గమనించారట. అంతేకాదు ఒంటరితనం, వాటి ప్రవర్తన, సామర్ధ్యాలపై విశేషమైన ప్రభావాన్ని చూపించిందని అంటారాయన.
పనిచేసే వాతావరణం ప్రేరణనిచ్చేదిగా ఉంటే.. ఉద్యోగుల పనితనం ఉత్తమంగా ఉంటుంది. తోటి ఉద్యోగుల ప్రభావం వ్య క్తిగత, బృంద సామర్ధ్యంపై ప్రభావాన్ని చూపుతుందని అంటారాయన. ఏ దేశమైనా, ఎంతటి గొప్ప వ్యక్తియైనా పరస్ప రాధారిత విధానంలోనే జీవించాలి. స్వావలంబనకై యత్నించడం సమంజసమే కాని స్వయం సమృద్ధి ఎవరికీ సాధ్యపడనిది. దేశ తలసరి ఆదాయం ఉన్నతంగా ఉన్నా ప్రజలు పేదరికంలో మగ్గవచ్చు.
దానికి కారణం సంపద కొంతమంది వద్దే ప్రోగుపడడం. అలాగే సంస్థలో నిరంతరం ఒకే స్థాయిలో అభ్యుదయమూ సాధ్యపడక పోవచ్చు. ఆర్థికపరమైన అభివృద్ధి, మాం ద్యమూ, నిరాశలు.. సంస్థ పురోగతిలో అంతర్భాగాలే. నిరుద్యోగత, ఉత్పత్తులు తగ్గడం, ఉత్పత్తి సామర్ధ్యం తగ్గడం ఆర్థిక మాంద్యతకు దారిచూపుతాయి. జనరల్ మోటార్స్ కంపెనీ అలాంటి ఎత్తుపల్లాలను చవిచూచిందే. నష్టాల అంచులకూ వెళ్ళింది.. లాభాలనూ పొందింది. నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,60,000 మంది ఉద్యోగులకు ఉపాధినిస్తూ సమున్నతంగా నిలిచింది.
ఆపదలు.. సంపదలుగా
ఆపిల్ కంపనీ ఒకప్పుడు దివాలా అంచులకు చేరిందే. తదుపరి అనేక ఉత్పత్తులపై కాకుండా ఐ-మాక్‌తో ప్రారంభిం చి అభివృద్ధిపై దృష్టిపెట్టింది. ఐ-మాక్ విజయవంతం కావడంతో.. ఐపాడ్, ఐప్యాడ్, ఐఫోన్ వంటి ముఖ్యమైన ఉత్పత్తులపై దృష్టిని సారించి వాటి నాణ్యత, ప్రామాణికతలను వినియోగదారుల అం చనాలకు మించి ఉన్నతీకరించింది. దాని వల్ల అమ్మకాలు, ఆదాయం పెరిగి సంక్షోభాన్ని అధిగమించడమే గాక అనూహ్య మైన లాభాలను ఆర్జించగలిగింది.
నిరంతరం కొత్త ఆవిష్కరణలను ఆలోచించడం, ఉత్పత్తులను సాంకేతికంగా ఆధునీకరించడం, వినియోగదారుల అనుభవాలకు, అభిప్రాయాలకు పెద్దపీట వేయడం వల్ల సంస్థ ప్రగతిని సాధించింది. వినియోగదారుల న మ్మకాన్ని, వాటాదారుల విశ్వాసాన్ని పొంది స్థిరమైన అభివృద్ధిని సాధిస్తూ సంబంధిత రంగంలో దిగ్గజమయింది.
దార్శనికత కలిగిన నాయకులు ప్రతికూల పరిస్థితిలో కూడా అవకాశాలను వెతుక్కుంటారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధులై ఉంటారు. వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తూ.. పరిస్థితులు దిగజారకుండా తగిన జాగ్ర త్తలు తీసుకుంటారు. ఎప్పుడైనా నడిచిన మార్గం గుండా నడిస్తే చేరిన లక్ష్యాన్నే చేరుకుంటాము. కొత్తమార్గంలో నడిస్తేనే కొత్త ఫలితాన్ని ఆస్వాదిస్తాము.
కొత్త మార్గంలో నడిచేందుకు వారు భయపడరు. సలహాలు తీసుకోవలసిన సమయంలో స్థా యీభేదాలను పాటించరు. తాము నష్టా ల్లో ఉన్నా.. అవకాశం ఉన్నమేరకు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడరు. తమను తాము ఉత్తేజ పరుచుకుంటూ, ఉత్సాహ పరుచుకుంటూ, ప్రేరణ నిచ్చుకుంటూ ముందుకు సాగిపోతారే కాని, ఆటంకాలు ఎదురవగానే భయపడి పారిపోరు.
ఉద్యోగులకు ప్రేరణనిస్తూ.. తమ కొనుగోలుదారులకు, అమ్మకందారులకు నమ్మకస్థులై నిలుస్తారే కాని క్లిష్ట సమయంలో వారిని మోసం చేయాలని ఏనాడూ భావించరు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమంగా నడిపిస్తూ ముందుకు సాగే నాయకత్వంలో ఆపదలు కూడా సంపదలుగానే పరిణమిస్తాయి.