calender_icon.png 18 September, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘షేక్‌హ్యాండ్’ వివాదం

17-09-2025 12:00:00 AM

ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయకపోవడం వివాదంగా మారింది. ‘షేక్ హ్యాండ్’ వివాదాన్ని భూతద్ధంలో పెట్టి చూస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని కోరుతూ ఐసీసీకి ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతేకాదు టోర్నీని బహిష్కరిస్తామని బెదిరింపులకు కూడా దిగింది.

అయితే పీసీబీ అభ్యర్థనను తోసిపుచ్చిన ఐసీసీ మ్యాచ్ రిఫరీని తొలగించేది లేదని స్పష్టం చేసింది. మరోవైపు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేయడాన్ని బీసీసీఐ తప్పుబట్టింది. పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడం, చేయకపోవడం తమ ఇష్టమని, క్రికెట్‌కు సంబంధించిన రూల్స్ బుక్స్‌లో ‘షేక్ హ్యాండ్’ కచ్చితంగా పాటించాలని ఎక్కడా లేదు. షేక్ హ్యాండ్ అనేది కేవలం ఒక మంచి సంజ్ఞ మాత్రమే.

అయినా పాకిస్థాన్‌తో గతంలోనే సంబంధాలు దెబ్బతిన్నాయని, పహల్గాం ఉగ్రదాడితో అది మరింత దూరం పెరిగిందని బీ సీసీఐ స్పష్టం చేసింది. ఆసియా కప్ ఐసీసీ ఈవెంట్ కాదు. ఈ టోర్నీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహిస్తుంది. దీనికి అధ్యక్షుడు పీసీబీ చైర్మన్ మొహ్‌సిన్ నఖ్వి. అందుకే మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయలేదంటూ పాక్ ఆటగాళ్లు ఏసీసీకి ఫిర్యాదు చేశారు.

పనిలో పనిగా భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి ప్ర ధాన కారణం మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ అని ఆరోపిస్తూ ఐసీసీకి ఫి ర్యాదు చేసింది. అయితే పీసీబీ ఫిర్యాదును ఐసీసీ పట్టించుకోకపోవడం వెనుక ప్రధాన కారణం ఐసీసీకి జై షా అధ్యక్షుడిగా ఉండటమే. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదంటూ స్వదేశంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

కానీ ఐ సీసీ, ఏసీసీ నిర్వహించే టోర్నీల్లో పాక్‌తో మ్యాచ్‌లు ఆడకపోతే భవిష్యత్తులో భారత్‌లో మేజర్ టోర్నీల నిర్వహణకు అడ్డంకులు ఏర్పడతాయనే కారణంతో ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడాల్సి వచ్చిందని బీసీసీఐ పేర్కొంది. భారత కెప్టెన్ సూర్యకుమార్ సహా ఆటగాళ్లు మ్యాచ్ విజయం అనంతరం పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూంకు వెళ్లిపోయారు.

ఇది ఒక జట్టుగా కలిసి తీసుకున్న నిర్ణయమని, షెడ్యూల్‌లో భాగంగానే పాక్‌తో మ్యాచ్ ఆడాల్సి వచ్చిందని సూర్య తెలిపాడు. సాయుధ దళాలకు, పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు సూర్యకుమార్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే భారత్‌లో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు హిందూ కార్డును వాడుతూనే ఉంటుందని, అందులో భాగంగా టీమిండియా కరచాలనం చేయడానికి ఇష్టపడలేదని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి.

అయితే రాజకీయ కారణాలతో ప్రత్యర్థి క్రీడాకారులతో కరచాలనం చేయకపోవడం క్రీడల్లో కొత్తేమీ కాదు. గతంలో 2023 వింబుల్డన్‌లో అజరెంకా (బెలారస్)తో చేతులు కలిపేందుకు స్వితోలినా (ఉక్రెయిన్) నిరాకరించింది. ఇకపై ఆసియా కప్‌లోనే కాదు ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీల్లోనూ పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయకుండా బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం!