బంగాల్‌లో ప్రతిపక్ష నేతగా రీతాబ్రత
- 58 మంది ఎమ్మెల్యేల సంతకాలతో స్పీకర్‌కు లేఖ
- ఆమోదించిన స్పీకర్
హైదరాబాద్, జూన్ 3(విజయక్రాంతి): పశ్చిమబంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బహిష్కృత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత రీతాబ్రత బెనర్జీ ఎన్నికయ్యారు. మమ తా బెనర్జీ ఆదేశాలను ధిక్కరిస్తూ 60 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమ నేతగా.. బహిష్కృత నేత రీతాబ్రతను ఎన్నుకున్నారు. ఆయనే ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్ రథీంద్రబోస్‌కు లేఖ ఇవ్వడం, ఆయన దీనిని ఆమోదిస్తూ ఆదేశాలు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన ఛాంబర్ తాళాలను కూడా సిబ్బంది రితబ్రతకు ఇచ్చేశారు.
మూడింట రెండొంతుల మెజార్టీ
టీఎంసీ బహిష్కృత నేతలైన రీతాబ్రత బెనర్జీ, సందీపన్ సహా 60 మంది ఎమ్మెల్యేలు బుధవారం బంగాల్ అసెంబ్లీకి చేరుకున్నారు. వీరంతా మమతా బెనర్జీని తమ అధినేత్రిగా అంగీకరిస్తూనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రీతాబ్రత పేరును ప్రతిపాదించా రు. ఈ మేరకు 58 మంది సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌కు సమర్పించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇందులో చేరనున్నారు. పార్టీని కార్పొరేట్ సంస్థలా నడుపుతున్నారంటూ అభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యూహం పన్నారు.
ఇది ఇప్పుడు మమతా బెనర్జీని తీవ్ర సంకటంలోకి నెట్టింది. ఇటీవల ఎన్నికల్లో టీఎంసీ నుంచి 80 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ చీలికకు దారి తీయకుండా ఉండాలంటే కనీసం 53 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. రీతాబ్రత వర్గానికి 60 మంది మద్దతు ఉండటంతో వారు మూడింట రెండు వంతుల బలాన్ని సులభంగా దాటేశారు. ఒకవేళ మమతా బెనర్జీ వీరి ప్రతిపాదనను తిరస్కరిస్తే వారు అసలైన టీఎంసీగా పేరును, గుర్తును క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. తాము కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో లేమని తిరుగుబాటు నాయకులు స్పష్టం చేశారు. మమతను గౌరవి స్తూనే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.






