9 May, 2026 | 11:31 AM

పల్లె దవాఖానాల్లో ఆర్‌ఎంపీ వైద్యం!

11-12-2024 12:32 AM
  • వైద్యులు, మెడికల్ ఆఫీసర్ల సహకారం..
  • మంత్రి జూపల్లి ఇలాఖాలోనే దుస్థితి

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): గ్రామాల్లోని పల్లె దవాఖానాలకు అలసత్వ జబ్బు పట్టుకుంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు గ్రామాల్లోని ఆర్‌ఎంపీలు, పీఎంపీలతో కుమ్మక్కై తరచూ పల్లె దవాఖాలకు తాళం వేసి పరోక్షంగా సహకరిస్తున్నారు. దీంతో గ్రామాల ప్రజలు సుదూర ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లలేక, పల్లె దవాఖానాల వైపు దీనంగా చూస్తూ ఉండలేక చివరకు ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.

ఇదే అదునుగా ఆర్‌ఎంపీలు స్థాయికి మిం చిన వైద్యం చేస్తూ పేదల జేబులకు చిల్లులు పెడుతున్నారు. పరిమితికి మించి యాంటీబయోటిక్ మందులు, నొప్పుల మందులు అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగా టం ఆడుతున్నారు. ఇలాంటి వాటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, పల్లె దవాఖానాల్లో నిత్యం తనిఖీలు జరపాల్సిన అధికారులు ఆర్‌ఎంపీలతో తెరవెనుక ఒప్పందాలు చేసుకుని అడ్డగోలుగా ముడుపులు అందుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కోడేరు మండలం తీగలపల్లి గ్రామ పల్లె దవాఖానాలోనే విష్ణు ఆర్‌ఎంపీ క్లినిక్ ఏర్పాటుకు సహకరించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మహిళా సమాఖ్య భవనంలో పల్లె దవఖానా ఏర్పా టు చేయగా నిత్యం తాళం వేసి ఉండటం తోపాటు దాని పక్క గడపలోనే ప్రైవేటు ఆర్‌ఎంపీ క్లినిక్ నడుస్తుండటం గమనార్హం. 

స్టాఫ్ నర్సులతోనే సరి

జిల్లాలో కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూ ర్, అమ్రాబాద్ వంటి ఏరియా ఆసుపత్రుల తో పాటు 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 124 పల్లె దవఖానాలు, 178 గ్రామీణ ఆరో గ్య కేంద్రాలు ఉన్నాయి. ఎంబీబీఎస్ స్థాయి వైద్యులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా కేవలం బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన స్టాఫ్ నర్సులు మాత్రమే పల్లె దవాఖానాలను నడుపుతున్నారు. వీరితో పాటు ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండాల్సి ఉంది.

గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్‌ఎంలు, ఆశాలు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులు, చిన్నపాటి దగ్గు, జలుబు వంటి వాటితో పాటు గర్భిణులకు, బాలింతలకు వైద్యసేవలను అందించాల్సి ఉంది. కానీ గ్రామీణ ప్రాంతంలో వైద్య సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం, అలసత్వం చూపుతూ ఆర్‌ఎంపీలకు అవకాశం కల్పిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో  పేదలకు ప్రభుత్వ వైద్యం అందడం లేదు.

దవాఖాలనాలకు తాళాలు

మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజక వర్గంలోని కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలోని పల్లె దవాఖాన నిత్యం తాళం తో దర్శనమిస్తున్నది. దాని పక్కనే ఆర్‌ఎంపీ క్లినిక్ నిర్వహి స్తుండటం గమనార్హం. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామో దర్‌రెడ్డిల స్వగ్రామం తూడుకుర్తిలో నూ పల్లె దవాఖానాకు తాళం వేసి దర్శనమిస్తోంది. పట్టణ నడిబొడ్డులోని 18వ వార్డులోనూ నూతనంగా ప్రారంభించిన పల్లె దవాఖానా పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. 

విచారించి చర్యలు తీసుకుంటాం

కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలోని పల్లె దవాఖాన ప్రాంతంలోనే ఆర్ ఎంపీ క్లినిక్ నడిపించే విషయం మా దృష్టికి రాలేదు. వెంటనే విచారించి చర్యలు తీసుకుంటాం.
 రాజశేఖర్, ప్రోగ్రామింగ్ ఆఫీసర్