జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం
– ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామసభ
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్రజా పాలన ప్రగతికి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక గ్రామసభను ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా డిఎస్పి నాగేంద్ర చారి, రూరల్ సీఐ నాగేశ్వరరావు, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, జిల్లెల్ల సర్పంచ్ దుబ్బాక రజితతో పాటు గ్రామ పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, వేగ పరిమితులను పాటించాలని వివరించారు.
గ్రామస్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా వివిధ అంశాలను వివరించి, ప్రమాదాలను నివారించడంలో ప్రజల పాత్ర కీలకమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల్లో చైతన్యం పెంచడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు, భద్రతా నియమాలను పాటించేందుకు తమ వంతు బాధ్యత తీసుకుంటామని తెలిపారు. మొత్తం కార్యక్రమం గ్రామంలో చైతన్యవంతమైన వాతావరణంలో సాగి విజయవంతమైంది.




