ట్యాంకు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న కార్యదర్శి
జహీరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): జరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని బిఆర్‌ఎస్ నాయకులు రాజ్ కుమార్ షట్కార్, బసవరాజ్ పాటిల్, శిరోమణి, సంగమేశ్వర్, సతీష్ వార్డు మెంబర్ అజీముద్దిన్ ఆరోపించారు.
వాటర్ ట్యాంక్ ను తొలగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామ కార్యదర్శి స్వప్న కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో ప్రజలకు మంచినీటి సౌకర్యం గురించి ఏర్పాటు చేసిన మినీ వాటర్ ట్యాంక్ ను గ్రామ ఉప సర్పంచ్ వాహబ్ తొలగించినట్లు పంచాయతీ కార్యదర్శి ఒప్పుకున్నారని గ్రామ ప్రజలు, గ్రామ వార్డు మెంబర్లు తెలిపారు. వాటర్ ట్యాంకు తొలగించి నాలుగు ఐదు రోజులు అవుతున్నప్పటికీ ఉపసర్పంచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై గ్రామ కార్యదర్శి స్వప్నను వివరణ కోరగా గ్రామానికి చెందిన గ్రామ ఉపసర్పంచ్ తమకు చెప్పకుండానే వాటర్ ట్యాంక్ ను తొలగించారని ఆమె తెలిపారు. తొలగిస్తున్న సమయంలో తాను సెలవులో ఉన్నానని వెంటనే తమ సిబ్బంది సమాచారం ఇవ్వగా ఆపివేయాలని వారికి తెలిపానన్నారు. అప్పటికే ఉపసర్పంచ్ వాటర్ ట్యాంక్ ను జెసిపి సహాయంతో తొలగించి కొద్ది దూరంలో ఆ వాటర్ ట్యాంక్ ను ఉంచాడని ఆమె వివరించారు. తాను ఎంపీడీవోకు విషయం తెలపడంతో గ్రామ ప్రజల అభీష్టమేరకే గ్రామ సభ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు గ్రామ కార్యదర్శి స్వప్న తెలిపారు.






