కోతుల బెడద నియంత్రణపై పటిష్ట చర్యలు
- మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్స్, అటవీ, జిల్లా పంచాయతీ శాఖ
- సమన్వయ సమావేశంలో కలెక్టర్ వెల్లడి
మెదక్ ఆగస్టు 18(విజయ క్రాంతి) : మెదక్ జిల్లాలో కోతుల బెడద నివారించడానికి స్థానిక శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో వేగవంతమైన కార్యాచరణతో ముందుకు కదరాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ సంబంధిత మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చాంబర్లో కో తుల బెడద నివారణపై డీఎఫ్‌ఓ జోజి, డిపిఓ యాదయ్య, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్స్ తో కలెక్టర్ ప్రతిమాసింగ్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లాలో కోతుల బెడద తీవ్ర రూపం దాల్చడంతో అనేక పర్యాయాలు రైతుల నుండి ప్రజల నుండి పంటలను ధ్వంసం చేస్తున్నాయని, ఇండ్లలో దూరి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని, చదువుకునే విద్యార్థిని విద్యార్థులు కూడా వీటి దాడిలో గాయపడ్డ సన్నివేశాలు ఉన్నాయనీ ప్రజావాణిలో అనేక విన్నపాలు రావడం జరిగిందని, అనేకమంది ప్రజలు , రైతులు కోతులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాటి నుండి పూర్తిగా విముక్తి చేయాలనే సదుద్దేశంతో క్షేత్రస్థాయిలో రైతుల పంటలను కాపాడాలని, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, ప్రజల సహాయ సహకారాలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
కోతులను పట్టడానికి వాటిని తరలించడానికి అవసరమయ్యే నిధులపై , ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహాయ సహకారాలు ఉంటాయన్నారు కోతులను పట్టిన వెంటనే స్థానిక అటవీ అధికారుల ఎఫ్‌ఆర్‌ఓ సహకారంతో నిర్మల్ జిల్లాకు తరలించి కుటుంబ నియంత్రణ పద్ధతి ద్వారా వాటిని అక్కడే విడిచి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కోతుల బెడద నియంత్రణ ఒక ఉద్యమంలో చేపట్టి ముందుకు వెళ్లినట్లయితే దశలవారీగా వాటి నిర్మూలించడానికి అందరి సహాయ సహకారాలు అందుతాయని తద్వారా కోతుల నియంత్రణ జిల్లాగా మెదక్ జిల్లా అని తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అటవీ అధికారి జోజి, డిపిఓ యాదయ్య మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.






