రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్
- అసైన్డ్ భూమిని ఆక్రమించి విలాసవంతమైన భవన నిర్మాణం
- డ్రగ్స్ కేసుతో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే
- పార్టీకి వచ్చిన ఏడు కార్ల జప్తు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 21 (విజయక్రాంతి): మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి చెందిన అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు శనివారం పోలీసుల సహకారంతో సీజ్ చేశారు. డ్రగ్స్ దందాకు వేదికగా మారడమే కాకుండా, ఈ కట్టడం వెనుక భారీ భూ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. నిరుపేదల కోసం కేటా యించిన అసైన్డ్ భూమిలో ఈ భవనాన్ని నిర్మించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీమ్ దాడి చేసిన సమయంలో పోలీసులు కేవలం మాదకద్రవ్యాల కోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే, విచారణలో ఫామ్‌హౌస్ భూమికి సంబంధించిన పత్రాలను రెవెన్యూ విభాగం జల్లెడ పట్టింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూమిని రోహిత్‌రెడ్డి అక్రమ మార్గా ల్లో చేజిక్కించుకుని, అక్కడ చట్ట విరుద్ధంగా భారీ భవనాన్ని నిర్మించినట్లు నిర్ధారించారు.
ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా, ప్రభుత్వ భూమిలో ఆక్రమణలకు పాల్పడినందుకు గాను సదరు ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకుని సీలు వేశారు. మరోవైపు, డ్రగ్స్ పార్టీ జరిగిన రాత్రి ఫామ్‌హౌస్‌లో నిలిపి ఉంచిన ఏడు విలాసవంతమైన కార్లను పోలీసులు ఇప్పటికే జప్తు చేశారు. ఆ వాహనాల యజమానుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
పార్టీకి కేవలం పట్టుబడ్డ 11 మందే కాకుండా, మరికొందరు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు కూడా హాజరయ్యారని, పోలీసుల రాకను ముందే గమనించిన కొందరు వీఐపీలు అక్కడ నుంచి జారుకున్నారని పోలీసు లు బలంగా అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా ఆ రాత్రి అక్కడ ఉన్న అజ్ఞా త వ్యక్తులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారా లను విశ్లేషిస్తున్నారు.
త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు సంకేతాలిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం తన వేటను మరింత ఉధృతం చేసింది. కోర్టు అనుమతి పొందిన వెంటనే పైలట్ రోహిత్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
నిందితుడిని నేరుగా ఫామ్హౌస్కు తీసుకెళ్లి, అక్కడ డ్రగ్స్ పార్టీ ఎక్కడ నిర్వహించారు.. కాల్పులు ఏ పరిస్థితుల్లో జరిగాయి.. ఎవరెవరు ఏయే గదుల్లో ఉండి డ్రగ్స్ సేవిం చారు.. అనే అంశాలపై సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ ద్వారా సంపాదించిన సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి మళ్లించారా.. అనే కోణంలోనూ సిట్ లోతైన విచారణ జరుపుతోంది.




