calender_icon.png 13 November, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంచల్‌గూడ జైలులో రౌడీషీటర్ల ఘర్షణ!

13-11-2025 12:00:00 AM

ధ్వంసమైన ములాఖత్ గది అద్దాలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్లు జాబ్రి, దస్తగిరి పరస్పరం దాడులు చేసుకున్నారు. జాబ్రికి తీవ్రగాయాలు కాగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో జైలులో ఒక్కసారిగా కలకలం రేగింది. జాబ్రి, దస్తగిరి మధ్య పాత కక్షలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి, అది కాస్తా భౌతిక దాడికి దారితీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ క్రమంలో ములాఖత్ గది అద్దాలను సైతం ధ్వంసం చేశారు. ఈ దాడిలో జాబ్రి తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న జైలు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

తీవ్రంగా గాయపడిన జాబ్రిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జైలు అధికారులు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. జైలులో భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు ఖైదీలు ఇంత తీవ్రంగా దాడులు చేసుకోవడంపై ఆరా తీస్తున్నారు.