12 May, 2026 | 6:09 AM

నాలుగేళ్లలో 50 వేల మందికి నైపుణ్య శిక్షణ

29-08-2024 07:25 AM
  1. ఎన్‌ఎస్‌ఐసీతో అవగాహన ఒప్పందం 
  2. జిల్లా స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తాం 
  3. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): జాతీయ చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఐసీ) సహకారంతో రాబోయే మూడు, నాలుగేళ్లలో 50వేల మంది యువతకు వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ అంది స్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఎన్‌ఎస్‌ఐసీ చైర్మన్ సుభ్రాంశు ఆచా ర్య, తెలంగాణ పరిశ్రమల, వాణిజ్య శాఖల అధికారులు నైపుణ్య శిక్షణకు సంబంధించిన అవగాహనా ఒప్పందాన్ని మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. నైపుణ్య అభివృద్ధి వల్ల మధ్య, చిన్న తరహా, సూక్ష్మ పరిశ్రమలకు శిక్షణ పొందిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎన్‌ఎస్‌ఐసీ ఇలాంటి ఒప్పందాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకోవడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం వల్ల చిన్న పరిశ్రమలు ముడిసరుకు కొనుగోలు, ఉత్పత్తుల విక్రయంలో ఎన్‌ఎస్‌ఐసీ సహకరిస్తుందని వివరించారు. జిల్లాస్థాయిలో ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు.

దీని కోసం తేజస్(తెలంగాణ ఎంట్రప్రెన్యూర్స్ జర్నీ ఫర్ యాస్పిరేషన్స్ అండ్ అఛీవింగ్ సక్సెస్) అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు వాస్తవ రూపం కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఎన్‌ఎస్‌ఐసీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంలో కూడా సహకరిస్తుందని వెల్లడించారు.

అత్యధిక ఉపాధి అవకాశాలు చిన్న పరిశ్రమల ద్వారానే పెంపొందించడం సాధ్యమవుతుందని అందుకే తమ ప్రభుత్వం వాటి వృద్ధి, విస్తరణల కోసం పాటుపడుతుందని తెలిపారు. ఎంవోయూ సంతకాల కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్ మల్సూర్, టీవర్క్స్ సీఈవో జోగిందర్ తనికెళ్ల, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శ్రీకాంత్ నాగప్ప తదితరులు పాల్గొన్నారు.