ఎన్‌హెచ్ ప్రయాణికుడి వద్ద రూ.9 లక్షల అపహరణ
చిట్యాల (నార్కెట్పల్లి), జులై 19:నార్కెట్పల్లి మండల పరిధిలోని జాతీయ రహదారి 65 పై పూజిత హోటల్ సమీపంలో ఆదివారం ప్రయాణికుడి వద్ద నుంచి రూ.9 లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపినవివరాల ప్రకారం ఖమ్మం రూరల్ జిల్లా నాయుడుపేటకు చెందిన ఆరె రవీందర్ రెడ్డి మోటార్ మెకానిక్, తన బామ్మర్ది ఆగు కొండూరు సంతోష్ రెడ్డితో కలిసి ఖమ్మంలోని వరంగల్ ఎక్స్ రోడ్ నుంచి టి ఎస్ 09 జెడ్ 8002 నంబరు గల ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు బయలుదేరాడు. తన టూర్ బ్యాగులో రూ.9 లక్షల నగదు తీసుకెళ్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆదివారం ఉదయం సుమారు 8 గంటలకు బస్సు నార్కెట్పల్లి మండలంలోని పూజిత హోటల్ వద్ద టిఫిన్ కోసం ఆగింది.
ఈ సమయంలో ఫిర్యాదుదారు తన బ్యాగును పక్కన పెట్టుకుని టిఫిన్ చేస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి బ్యాగును గుంజుకుని, అక్కడే సిద్ధంగా ఉన్న కారులో ఎక్కి పరారయ్యాడు. ఆ కారులో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. వారు హైదరాబాద్ వైపు వేగంగా వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సీఐ సిరికొండ సురేష్, ఎస్‌ఐ పీ. విష్ణుమూర్తి తెలిపారు.






