రిజర్వేషన్ల రద్దు కుట్ర వెనుక ఆర్‌ఎస్‌ఎస్
మనువాదాన్ని అమలు చేసేందుకు ప్రధాని మోదీ యత్నం
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారు..
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క
కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 2 (విజయక్రాంతి): బీజేపీ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ఉవ్విళ్లూరుతూ, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నదని, ఆ కుట్ర వెనుక ఆర్‌ఎస్‌ఎస్ ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. ఆసిఫాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ స్వగృహంలో బుధవారం ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆర్‌ఎస్‌ఎస్ మనవాదాన్ని ప్రధాని మోదీ అమలు చేయాలని చూస్తున్నారన్నారు. పదేళ్ల నుంచి ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు జాతిసంపదను కట్టబెట్టే పనిలోనే ఉన్నారన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారన్నారు. నాటి సీఎం కేసీఆర్ కూడా రిజర్వేషన్లను మార్చాలని అభిప్రాయం వ్యక్తం చేశారని, ఆ ఫలితాన్ని ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామిక విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. జిల్లాలో తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు తాను కృషి చేస్తానన్నారు. ప్రజలకు వైద్యం, రోడ్లు, విద్య వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ కోనేరు కృష్ణ, పార్టీ నేతలు శ్యాంనాయక్, బాలేష్ గౌడ్, అనిల్ గౌడ్ పాల్గొన్నారు.




