తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణ
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్ అమలు చేస్తున్నదని, ఆర్‌ఆర్‌ఆర్ అంటే రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ, రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగంతోపాటు బిల్డర్స్ నుంచి భారీగా వసూళ్ల పర్వం కొనసాగుతున్నదన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవానం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వసూలు చేసే ట్యాక్స్‌కు ఎలాంటి రశీదులు ఉండవని, అంతా దోపిడీనేనని ఆరోపించారు. అబద్ధాల పునాదులపై సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారని విమర్శించారు.
సీఎం హైదరాబాద్‌ను సెటిల్మెంట్లకు బ్రాండ్ గా మార్చేశారన్నారు. ట్యాక్స్‌లకు భయపడి ఎన్నో ప్రముఖ నిర్మాణ కంపెనీలు రాష్ట్రానికి రావడం లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో నాటి మంత్రి కేటీఆర్ బిల్డర్ల నుంచి ఏకంగా ఫ్లోర్స్ రాసివ్వాలని అడిగితే, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పీఠానికీ డబ్బులు పంపాలని కేటీఆర్ కంటే ఎక్కువ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. కర్ణాటకలో గత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్ల నుంచి వసూలు చేసిన పర్సంటేజీ కంటే, సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో వసూలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో తాయిలాలు ఇచ్చేందుకే సీఎం అక్రమంగా డబ్బు వసూలుకు పాల్పడుతున్నారన్నారు.




