30 July, 2026 | 11:52 AM

ఆదాయం కోసం ఆర్టీసీ అగచాట్లు!

25-08-2024 01:40 AM
  1. బస్సుల్లో పురుషులను ఎక్కించడమే లక్ష్యం 
  2. కిలోమీటరుకు రూ. 40 ఆదాయం రావాల్సిందే.. 
  3. కండక్టర్, డ్రైవర్లపై అధికారుల ఒత్తిడి 
  4. ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్ (ఈపీకె) టార్గెట్‌లు 
  5. లక్ష్యాన్ని చేరకుంటే కౌన్సిలింగ్ పేరుతో వేధింపులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఆదాయం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం అనంతరం రోజువారి ఆదాయం తగ్గిందనే చెప్పొచ్చు. బస్సుల్లో అత్యధికంగా మహిళా ప్రయాణికులే ఎక్కుతుండగా, పురుషులు(విద్యార్థులు, ఉద్యోగులు) కూడా అధిక మొత్తంలో నెలవారీ పాస్‌లు కలిగి ఉంటున్నారు. బస్‌పాస్‌ల ద్వారా ఆర్టీసీకి ఒకేసారి నెలవారీగా ఆదాయం వస్తున్నది. మహిళా ప్రయాణికుల చార్జీలను ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తున్నది. ప్రభుత్వం నుంచి వచ్చే మహాలక్ష్మీ పథకానికి సంబంధించిన బిల్లులు ప్రతి నెల కచ్చితంగా వచ్చే అవకాశం లేనందున రోజువారి, నెలవారి నిర్వహణ, ఇతరత్రా అవసరాలకు ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై ఆర్టీసీ దృష్టి సారిస్తున్నది. 

బస్సుల్లో మహిళా ప్రయాణికుల కిటకిట

గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని 25 డిపోల వ్యాప్తంగా దాదాపుగా 2,800 బస్సులు నడుస్తున్నాయి. మహాలక్ష్మీ పథకం తర్వాత గ్రేటర్‌లో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగింది. మహాలక్ష్మీ పథకం అమలుకు ముందు రోజుకు 11 లక్షలకు పైగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు. మహాలక్ష్మీ పథకం అమలు అనంతరం ఈ సంఖ్య 16 నుంచి 17 లక్షలకు పెరిగింది.

ఈ ప్రయాణికుల్లో సుమారు 60 శాతం మంది మహిళలే ఉండగా.. 40 శాతం మాత్రమే పురుషులు ఉన్నారు. ఈ 40 శాతం పురుషుల్లోనూ సుమారు 90 శాతం మంది నెలవారి బస్‌పాస్‌లు కలిగిన విద్యార్థులు, ఉద్యోగులే ఉంటున్నా. దీంతో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం విపరీతంగా పడిపోయింది. ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం పొందే ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించి కండక్టర్లకు టార్గెట్‌లు విధిస్తున్నది. 

ఈపీకే పేరుతో వేధింపులు?

బస్సుల్లో పురుషులను ఎక్కించి టికెట్ జారీ చేయడం ద్వారా ఆదాయం పొందడానికి ప్రతి బస్టాప్‌లోనూ కండక్టర్లు ఎదురు చూస్తున్నారు. ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్ (ఈపీకే) పేర కిలో మీటరుకు రూ.40 ఆదాయం తీసుకురావాలని ఆర్టీసీ కండక్టర్లను ఆదేశించింది. ఆర్టీసీలో కొత్తగా అమలవుతున్న ఈ విధానంపై ఎలాంటి జీవో కానీ, సర్క్యూలర్‌గానీ లేదు. కేవలం మౌఖిక ఆదేశాలివ్వ డంతో కండక్టర్లు, డ్రైవర్లకు గుదిబండగా తయారవుతున్నది. ఉదాహరణకు మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ (5కే సర్వీస్)కు 14 కిలో మీటర్లు దూరం ఉంటుంది. ఈపీకే ప్రకారం 14 కిలోమీటర్లకు ఒక్కో కిలోమీటరు రూ.40 చొప్పున మొత్తం రూ.560లకు టికెట్‌లు జారీ చేసి ఆదాయం రాబట్టాలని ఆర్టీసీ ఆదేశిస్తుంది.

మూడుసార్లు ఈపీకే టార్గెట్ పూర్తి చేయని సిబ్బందిని ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ పేరుతో వేధిస్తున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా రెగ్యులర్ అప్పగించే రూట్‌ను మార్చుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఆర్టీసీ బస్సులు మహిళా ప్రయాణి కులతో ప్రతిరోజూ నిండుతూనే ఉన్నా.. టార్గెట్‌లు విధిస్తూ తమను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో అమలు చేస్తున్న ఈపీకే పద్ధతిని తక్షణమే  తొలగించాలని సిబ్బంది కోరుతున్నారు. 

కండక్టర్ల అగచాట్లు

బస్సుల్లో అత్యధికంగా మహిళా ప్రయాణికులే ఎక్కుతుండటంతో పురుషులు బస్సులు ఎక్కేందుకు ఆసక్తి చూపడం లేదు. ఓలా, ఊబర్, రాపిడో, ఆటో వంటి ప్రత్యామ్నాయ ట్రాన్స్‌పోర్టును ఆశ్రయిస్తు న్నారు. బస్‌పాస్‌లు కలిగిన వారే బసుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈపీకే టార్గెట్ పూర్తికాక కండక్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. పురుషులను బస్సు ఎక్కించడం కోసం కండక్టర్లు బస్టాండుల్లో రండి బాబు రండి అంటూ అరవాల్సిన పరిస్థితి నెలకొన్నది.