రుమీ.. మన సరికొత్త రాకెట్
భారత తొలి పునర్వినియోగ రాకెట్ సక్సెస్
ప్రైవేటు సంస్థ స్పేస్ జోన్ రూపకల్పన
బెంగళూరు, ఆగస్టు 24: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో అద్భుతం ఆవిష్కరించింది. తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. తమిళనాడుకు చెందిన ప్రైవేటు సంస్థ స్పేస్ జోన్ ఇండియా సంస్థ మార్టిన్ గ్రూప్‌తో కలిసి రూపొందించిన రుమీటీ రాకెట్ చెన్నైలోని తిరువిదంధ నుంచి శనివారం ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఇంకో అద్భుతం ఏంటంటే ఈ రాకెట్‌ను ప్రయోగించటానికి షార్ వంటి ప్రత్యేక రాకెట్ లాంచ్‌ప్యాడ్లు అవసరం లేదు. మొబైల్ లాంచర్‌పై నుంచి ఎక్కడి నుంచైనా దీనిని ప్రయోగించవచ్చు.
తిరిగి భూమికి
ఇస్రో ప్రయోగించే రాకెట్లు ఒకసారి అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తర్వాత మళ్లీ భూ వాతావరణంలోకి వచ్చి కాలిపోవటమో, లేదంటే అక్కడే ముక్కలైపోవటమో జరుగుతుంది. కానీ, రుమీ అలా కాదు. ప్రస్తుతం దీని ప్రధాన లక్ష్యం భూమిపై గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను అంచనా వేయటం. ఆ పని పూర్తయిన తర్వాత తిరిగి భూమిపైకి వస్తుంది. ఇందులో జెనరిక్ ఇంధనాన్ని వాడుకొని పనిచేసే హైబ్రిడ్ మోటార్‌తోపాటు ఓ పారాచ్యూట్ ఉంటుంది. ఈ మోటార్ సాయంతో పారాచ్యూట్‌ను వాడుకొని సురక్షితంగా భూమిపైకి వస్తుంది. ఈ రాకెట్‌లో అత్యంత ప్రత్యేకమైనది హైబ్రిడ్ ప్రొపల్షన్ వ్యవస్థ. ఇది ద్రవ, ఘన రెండు రకాల ఇంధనాలతో పనిచేస్తుంది. దీనివల్ల అధిక మన్నికతోపాటు ఖర్చు కూడా తగ్గుతుందని తయారీ సంస్థ తెలిపింది.






