రష్యా, ఇరాన్ కింకర్తవ్యం
ఇప్పటికే ఉక్రెయిన్‌తో సుధీర్ఘంగా జరగుతున్న యుద్ధంతో రష్యా ఎంతో నష్టపోయింది. ఎంతోమంది రష్యన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో రష్యా తమ మిత్రడు అసద్‌కు సహాయం అందించలేకపోయింది. అసద్‌కు అండగా ఆ దేశంలో సైన్యాన్ని ఉంచిన రష్యాకు హెచ్‌టీ ఎస్ విజయం తలనొప్పిగా మారనుంది. అసద్ పతనాన్ని రష్యాకు పెద్ద దె బ్బగా చెప్పవచ్చు. ఒకేసారి రెండు ప్రాంతాల్లో రష్యా పోరాడలేదని సిరియా పతనం చూపించిందని ఉక్రెయిన్ పేర్కొన్నది.
అసద్‌కు అండగా సిరియాలో ఇప్పటికే ఎయిర్‌బేస్‌లను రష్యా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మిడిల్ ఈస్ట్‌లో రష్యా తన ప్రాభవాన్ని ఎలా కాపాడుకుంటుందనేది వేచి చూడాలి. మరోవైపు ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న ఇరాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. హెజ్‌బొల్లా, హమాస్ తీవ్రవాదులకు అండగా ఉంటున్న ఇరాన్.. ఇప్పుడు సిరియాలో జరిగిన పరిణామాలతో ఏ విధంగా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హెచ్‌టీఎస్ రెబెల్స్‌తో పోరాడడానికి అసద్‌కు అండగా హెజ్‌బొల్లా తీవ్రవాదులను ఇరాన్ పంపింది.
ఇంకోవైపు రెబెల్స్‌కు టర్కీ పూర్తి అండగా నిలిచి ఆయుధాలను అందించింది. అయితే ఎక్కడా టర్కీ తన పాత్రను బయటపెట్టలేదు. అసద్‌పై పోరాటంలో టర్కీ పరోక్ష పాత్రను పోషించింది. ఇజ్రాయెల్‌కు సిరియా పరిణామాలు ఆందోళనను, సంతోషాన్ని కల్గిస్తున్నాయి. అసద్‌కు అండగా ఇరాన్ పంపిన హెజ్‌బొల్లా తీవ్రవాదులు విఫలమయి అసద్‌ను కాపాడలేకపోయారు. అలాగే హెజ్‌బొల్లాకు ఆయుధాలు అందడం భవిష్యత్తులో కష్టంగా మారనుంది. దీంతో ఇరాన్, హెజ్‌బొల్లాను ఎదుర్కోవడం ఇజ్రాయెల్‌కు తేలిక కానుంది.






