- వచ్చే నెల 2 నుంచి లాంచీ టూర్ షురూ
- నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం
నల్లగొండ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం వరకు లాంచీ టూర్‌కు తెలంగాణ పర్యాటకశాఖ పచ్చజెండా ఊపింది. వచ్చే నెల 2 నుంచి పర్యాటకుల కోసం లాంచీ సౌకర్యాన్ని ప్రారంభించనున్నది. పర్యాటకులు సోమవారం నుంచే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఒకవైపు ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, చిన్నారులకు రూ.1,600 చొప్పున టికెట్ ధర నిర్ణయించింది. అప్ అండ్ డౌన్ అయితే పెద్దలకు రూ.3 వేలు, చిన్నారులకు రూ. 2,400 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒకవైపు ప్రయాణానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. ప్రయాణంలో ఒకసారి ప్రయాణికులకు భోజన వసతి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తొలి లాంచీ సాగర్ నుంచి బయల్దేరుతుంది.
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు లాంచీ నాగార్జున సాగర్‌కు చేరుతుంది. సాగర్ జలాశయంలో 550 అడుగులకుపైగా నీరుంటేనే లాంచీ ప్రయాణానికి సాధ్యమవుతుందని, పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని తెలంగాణ టూరిజంశాఖ సూచిస్తున్నది. లేనిపక్షంలో ప్రయాణం సాధ్యం కాదని తెలిపింది.