ఇందిరమ్మ ఫేజ్ సిద్ధం!
జూన్ 2న శ్రీకారం చుట్టనున్న సర్కార్
జిల్లాకు మరో 10వేల ఇళ్లు
ఒక్కో నియోజకవర్గానికి 2వేల చొప్పున కేటాయింపు
తీరనున్న లబ్దిదారుల ఆశలు
సంగారెడ్డి, మే 26 (విజయక్రాంతి): రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 2న శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినేట్లో ఒక్కో నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లుగా రాష్ట్ర గృహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు సంగారెడ్డి జిల్లాకు ఈ విడతలో మరో పదివేలకు పైగా ఇండ్లు మంజూరయ్యే అవకాశముంది. వీటిపై అర్హులైన నిరుపేదలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.. కాగా మొదటి విడతకు సంబంధించిన నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడం గమనార్హం.
నియోజకవర్గానికి 2వేల చొప్పున...
సీఎం రేవంత్రెడ్డి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు జూన్ 2న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. తొలివిడత గృహ ప్రవేశాలతో పాటు రెండో విడత ఇండ్లకు భూమిపూజ చేయనున్నట్లు తెలిసింది. మలి విడతగా నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్ళను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన సంగారెడ్డి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు కలిపి 10వేల ఇళ్లు మంజూరు కానున్నాయి.
తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయించిన విషయం తెలిసిందే. గతంలో మాదిరి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేస్తే మరిన్ని మంజూ రయ్యే అవకాశాల్నుట్లుగా తెలుస్తోంది. కాగా ఇండ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి ప్రకటనతో జిల్లాలోని అర్హులైన పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తొలి విడతలో వివిధ కారణాలతో ఇళ్లు రాని పేదలకు ఈ విడతలో మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు.
క్షేత్రస్థాయిలో సర్వే...
జిల్లా వ్యాప్తంగా ఇంటి స్తలం కలిగి ఇళ్లు లేనటువంటి వారు సుమారు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం తాజా ప్రకటనతో ఇందులో అర్హులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం వివిధ శాఖల మండల స్థాయి గెజిటెడ్ అధికారులను నియమించారు. సదరు అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి విచారణ చేపడుతున్నారు. తొలివిడతలో 80 శాతానికిపైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మలి విడత మంజూరవుతున్న దృష్ట్యా మిగిలిపోయిన ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.






