29 April, 2026 | 3:23 AM

స్వీయగణనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

29-04-2026 01:36 AM

జన గణన స్వీయ నమోదు చేసుకున్న సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి , ఏప్రిల్ 28 (విజయక్రాంతి): జన గణన ప్రక్రియలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  స్వీయ నమోదు చేసుకున్నారు. జన గణనలో ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ వెబ్ సైట్ https://se.census.gov.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్ పాండు, సెన్సేస్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి, సిపిఓ తో కలిసి కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

జన గణన ప్రక్రియను సులభంగా,  సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్ లో కానీ, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు. స్వీయ గణన  ఈనెల 26 నుండి ప్రారంభమైందని, మే 10వ తేదీ వరకు స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు.

జన గణనకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని అన్నారు. వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి జారీ చేయబడుతుందని తెలిపారు. ప్రభుత్వంచే నియమించబడిన ఫీల్ ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐ.డి నెంబర్ తెలియజేయాలని సూచించారు.

ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే, ఆన్లైన్లో నమోదు చేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐ.డి ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధృవీకరిస్తారని అన్నారు. దీనివల్ల ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండే వారు, విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణాల్లో ఉన్న ప్రజలు కూడా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు. డిజిటల్ స్వీయ గణన గురించి ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను చైతన్య పరచాలని కలెక్టర్ కోరారు.