09-01-2026 12:00:00 AM
సంప్రదాయాల, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు
పటాన్ చెరు, జనవరి 8: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి సంబరాలను ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించారు. మన దేశం గొప్పతనాన్ని, వ్యవసాయ వారసత్వాన్ని ఈ వేడుకలు ప్రతిబింబించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల సంక్రాంతి సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించాయి. మొత్తంమీద పంటల వేడుక యొక్క రంగులు, సంప్రదాయాలు పండుగ స్పూర్తిని సజీవంగా నిలిపాయి.
పలు విభాగాల విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఐక్యత, సామరస్యాన్ని సూచిస్తూ భోగి మంటలను వెలిగించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గొబ్బెమ్మలతో అలంకరించిన సాంప్రదాయ రంగోలి (ముగ్గు) డిజైన్లు, గాలిపటాలు ఎగురవేయడం, సంప్రదాయ దుస్తులలో విద్యార్థులు చేసిన ఆకర్షణీయమైన జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ప్రాంగణమంతా ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదేశంగా మారింది.
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి, సమగ్ర ప్రాంగణ వాతావరణాన్ని ప్రోత్సహించడంలో గీతం యొక్క నిబద్ధతను ఈ వేడుకలు పునరుద్ఘాటించాయి. ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ పర్యవేక్షణలో, విద్యార్థి క్లబ్ అన్వేషణ ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించింది.