29 July, 2026 | 12:49 AM

ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారిగా సంతోష్ కుమార్

29-07-2026 12:00 AM

నాగల్ గిద్ద, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం నిర్వహిస్తున్న ’రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం విజయవంతంగా 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణలోని ప్రతి జిల్లా నుంచి ముగ్గురు ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారులను ఎంపిక చేసి సన్మానించారు. ఈ సందర్భంగా కల్హేర్ మండల రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ఎం.సంతోష్ కుమార్ ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారిగా ఎంపికై ప్రత్యేక గుర్తింపు పొందారు.

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో ఆయనకు శాలువా కప్పి, మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా చేరవేస్తూ విశేష సేవలు అందించినందుకు ఈ గౌరవం దక్కిందని అధికారులు తెలిపారు.  వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొని ఎం.సంతోష్ కుమార్ను అభినందించారు.