సరబ్‌జోత్‌కు స్వర్ణం
మ్యూనిచ్: ప్రతిష్ఠాత్మక ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ సరబ్‌జోత్ సింగ్ స్వర్ణంతో సత్తా చాటాడు. గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్‌జోత్ పసిడి పతకంతో మెరిశాడు. ఫైనల్లో సరబ్‌జోత్ 242.7 పాయింట్లతో స్వర్ణం చేజెక్కించుకున్నాడు. బూ షుహాంగ్ (చైనా), రాబిన్ వాల్టర్ (జర్మనీ) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. బుధవారం క్వాలిఫయింగ్ రౌండ్‌లో సరబ్‌జోత్ 588 స్కోరు నమోదు చేసి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. 2023 ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సరబ్‌జోత్ పిస్టల్ ఈవెంట్ విభాగంలో భారత తరపున పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి షూటర్‌గా నిలిచాడు. హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లోనూ సరబ్‌జోత్ పసిడి, రజతంతో మెరవడం విశేషం.






