21 August, 2026 | 12:43 AM

తుది జట్టులోకి సారాంశ్ జైన్

21-08-2026 12:27 AM

రెండో టెస్టుతో అరంగేట్రం ఖాయం

కుల్దీప్ యాదవ్‌పై వేటు?

బ్యాటింగ్ బలం పెంచే వ్యూహం

తొలి టెస్టులో టీమిండియా భారీ విజయాన్నే అందుకున్నా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ తడబాటు నిరాశ పరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 200 కూడా కొట్టలేకపోయింది. దీంతో బ్యాటింగ్ డెప్త్ పెంచే క్రమంలో స్పిన్ ఆల్ రౌండర్ సారాంశ్ జైన్‌ను బరిలోకి దింపబోతోంది.

కొలంబో, ఆగస్టు 20: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించిన భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది. కొలంబో వేదికగా జరగబోయే రెండో టెస్టు కోసం తుది జట్టులో కీలక మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. 33 ఏళ్ల ఆల్రౌండర్ సారాంశ్ జైన్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

కుల్దీప్ యాదవ్ తొలి టెస్టులో లయ కోల్పోయి ధా రాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. దీంతో జట్టు కూర్పును మరింత బలోపేతం చేసేందుకు ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేసే సారాంశ్ వైపు యాజమాన్యం మొగ్గు చూపుతోంది. దీనికి రెండు కారణాలున్నాయి. లంక జట్టులో కుడిచేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉండటం భారత్‌కు కలిసివచ్చే అంశం. వారు ఆఫ్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

లంక ఓపెనర్ నిషాన్ మదుష్క కేవలం 5 ఇన్నిం గ్స్‌లో రెండుసార్లు కుడిచేతి ఆఫ్ స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నాడు. గాలేలో అరంగేట్రం చేసిన మానవ్ సుతార్ 10 వికెట్లతో సరికొత్త రికార్డు సృష్టించగా, రవీంద్ర జడేజా 4 వికెట్లతో రాణించారు. మరో ఆఫ్ స్పిన్నర్ తోడైతే లంకను మరింత కట్టడి చేయవచ్చని భావిస్తోంది. అలాగే గాలే టెస్టులో బ్యాటింగ్ లైనప్‌లో లోతు తగ్గడం, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 193 పరుగులకే కుప్పకూలడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేసింది.

ఈ క్రమంలో 33 ఏళ్ల ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న సారాంశ్ జైన్ బ్యాట్‌తోనూ రాణించగలడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 54 మ్యాచ్‌లు ఆడిన సారాంశ్, 31.75 సగటుతో 2223 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లోయర్ ఆర్డర్ లో అతడు అందించే పరుగుల సహకారం భారత లోయర్ ఆర్డర్‌ను పటిష్టం చేస్తుందనడంలో సందేహం లేదు. జైన్ జాతీయ జట్టు పిలుపు అందుకున్నాడు. ఇతను నిలకడైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 181 వికెట్లు పడగొట్టాడు.