‘నా చిన్నప్పుడు మా తాత (తల్లి సోనీ రాజ్దాన్ తండ్రి నరేంద్రనాథ్ రాజ్దాన్) నాకు చాలా కథలు చెప్పేవారు. ముఖ్యంగా చున్ను, మున్ను, గన్ను అనే మూడు పాత్రలతో ఆయన చెప్పే కథలు నాకు భలే నచ్చేవి. ఆ మూడు పాత్రలు మనుషులో చీమలో ఎలుకలో కూడా తెలియదు. ఇక మా అక్క షాహీన్ పుస్తకాల పురుగు. నాకు కథలు చదివి వినిపించేది. మా అమ్మాయి రాహా పుట్టాక పిల్లల కథల గురించి మళ్లీ ఆలోచన వచ్చింది.
ఇప్పుడు దానికి 19 నెలలు. రోజూ నేను దానికి నిద్రపోయే ముందు కనీసం మూడు కథల పుస్తకాలు చదివి వినిపిస్తాను. రకరకాల గొంతులతో పాత్రలను చదువుతాను. చాలా ఆసక్తిగా వింటుంది. తర్వాత ఆ పుస్తకాలను కౌగిలించుకుని నిద్రపోతుంది. నా పుస్తకంలోని కథ కూడా వినిపించాను.
అయితే కథ కంటే కూడా దానికి పుస్తకంలోని బొమ్మలు బాగా నచ్చుతాయి. పిల్లల పుస్తకాలే కాదు పిల్లల బొమ్మలు కూడా బోధనాత్మకంగా ఉండాలి. నేను రచయితను కాను. స్టోరీటెల్లర్‌ని. మనందరం కథలు రాయలేకపోయినా చెప్పగలం.’ అంటోంది ఆలియా.
నా ఫేవరెట్ బుక్
అన్నీ ఉన్నా ఏమీ లేదు అనుకువాళ్లు, చిన్న చిన్న విషయాలకే కుంగుబాటులో ప్రయాణించే వాళ్లు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ‘వెన్ బ్రీత్ బికమ్స్ ఏయిర్’. ఇది రష్మికకు ఇష్టమైన పుస్తకం. 37 సంవత్సరాల వయసులోనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయిన అమెరికన్ న్యూరోసర్జన్ పాల్ కళానిధి ఆటోబయోగ్రఫీలాంటి పుస్తకం ఇది. ‘న్యూయార్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లర్’ జాబితాలో నెంబర్‌వన్‌గా నిలిచి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నది ఆ పుస్తక పరిచయం.
ఎప్పుడూ చురుగ్గా, ఉల్లాసంగా ఉండే కుర్రాడికి తనకు క్యాన్సర్ అనే భరించలేని విషాదవార్త తెలిస్తే ఎలా ఉంటుంది? కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. కళ్ల ముందు చీకటి కమ్ముకుంటుంది. అయితే తనకు క్యాన్సర్ ఉందని తెలియగానే పాల్ కళానిధి స్పందించిన తీరు వేరు. ఆయన తన మిత్రుడికి ఇలా మెయిల్ చేశాడు.. ‘గుడ్ న్యూస్ ఏమిటంటే మహాకవులు కీట్స్, స్టీఫెన్ క్రేన్‌ల సాహిత్యాన్ని చదువుకోవడం.
బ్యాడ్‌న్యూస్ ఏమిటంటే ఇంత వరకు ఒక్క అక్షరం కూడా నేను రాయకపోవడం’ కళానిధి వైద్యాన్ని ఎంతగా ప్రేమించాడో, సాహిత్యాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు. ‘పదిహేడేళ్ల వయసులో నువ్వు ఏమవుతావు? అని నన్ను ఎవరైనా అడిగి ఉంటే కచ్చితంగా రచయిత అనేవాడిని.
జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సాహిత్యాన్ని మించిన సాధనం లేదు’ అనే కళానిధి యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు ముందు స్టాన్‌ఫోర్డ్‌లో సాహిత్యంలో రెండు బీఏలు చేశాడు. కేంబ్రిడ్జిలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేశారు.
నాకు ఇష్టమైన నవల
దీపికా పదుకొనెకు ఇష్టమైన పుస్తకం ‘ది కైట్ రన్నర్’. కాస్త ఖాళీ సమయంలో దొరికితే పుస్తకాలు చదవడానికే ఇష్టపడుతుందట. ది కైట్ రన్నర్ పుస్తకాన్ని ఖలీద్ హొస్సేన్ రాసిన నవల. ఇది అప్గానిస్తాన్‌లో స్నేహం, ద్రోహం, విముక్తి, విమోచన వంటి ఇతివృత్తాల చుట్టూ తిరిగే ఒక శక్తివంతమైన కథ. ఈ నవలలోని రెండు పాత్రలు అమీర్, హసన్ అనే ఇద్దరు స్నేహితుల కథను చెబుతుంది.
వారి మధ్య ఉన్న అసాధారణమైన స్నేహం, అలాగే వారి జీవితాలపై రాజకీయ, సామాజిక మార్పుల ప్రభావం ఇందులో ఉంటుంది. దీపికకు పుస్తకాలు, చదువుపై తన అనుభవాలు పంచుకుందిలా.. ‘స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే క్రీడల వైపు ఆసక్తి ఉండేదని, ఆ తర్వాత మోడలింగ్, నటనవైపు దృష్టి మళ్లింది. అయితే ఒకానొక దశలో మానసికంగా చాలా కుంగుబాటుకు లోనయ్యా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చేవి.
అవిశ్రాంతమైన పనిచేస్తూ, మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, చివరికి ఒక రోజు స్పృహ కోల్పోయా. రెండు రోజుల తర్వాత, నిరాశతో బాధపడుతున్నానని గ్రహించి చికిత్స తీసుకున్నాను. జీవితంలో వచ్చిన ఎన్నో మార్పులను అవగాహన చేసుకుంటూ.. నన్ను మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగాను. ఈ ఒత్తిడి అనేది కంటికి కనిపించదు, కానీ అనుక్షణం దెబ్బతీస్తుంది.
మన జీవితంపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. నిజానికి మన చుట్టూ ఈ సమస్యతో బాధపడేవారు చాలామందే ఉంటారు. అందుకే రాయడం అలవర్చుకోవాలని పిల్లలకు సలహా ఇస్తా. జర్నలింగ్ అనేది మనమనసులోని భావాలను ప్రాసెస్ చేయడానికి, వ్యక్తీకరించడానికి ఒక మంచి మార్గం. మన బలాలు, బలహీనతలను గుర్తించి.. బలాలపై దృష్టి పెట్టడం, బలహీనతలను మెరుగుపరచుకోవడం చాలా అవసరం’ అంటోంది దీపికా.
దీపికా పదుకొనే