మీ పాలనకు జీరో వ్యాల్యూ
మహిళలకు 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలివ్వడం వాస్తవమైతే, రాజీనామా చేస్తా
- ముఖ్యమంత్రి సంతకానికి జీరో వాల్యూ
- ఆరు గ్యారెంటీల ఫైల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా?
- ఢిల్లీ నుంచి నిధులు తేవడం కాదు.. ఢిల్లీకే నిధులిచ్చి వస్తున్నారు
- కూలగొట్టు.. చెడగొట్టు.. పడగొట్టు అన్నట్టుంది పాలన
- నాడు నీరో చక్రవర్తి.. నేడు జీరో చక్రవర్తి
- అసెంబ్లీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం చేసిన తొలి సంతకానికి, తొలి ఫైల్‌కు జీరో వాల్యూ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని సీఎం సంతకం చేసిన ఫైల్ ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా అని నిలదీశారు. సీఎం సంతకం చేసిన ఫైల్‌కే దిక్కులేకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు.
మాయమైన ఆ ఫైల్‌కు సంబంధించిన అంశం పైన ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చేసిన డిక్లరేషన్లకు ప్రజ ల దృష్టిలో జీరో వాల్యూ, ఇవన్నీ చూస్తుంటే విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ ఉన్నదని అర్థమవుతున్నద న్నారు. మహిళలకు రూ. 57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలివ్వడం వాస్తవమైతే, దానికి సంబంధించిన జీవోలను, ఆర్డర్లను చూపిస్తే నేను ఇక్కడే రాజీనామా చేసి వెళ్ళిపోతానని, మరి సభను తప్పుదోవ పట్టించినందుకు భట్టి విక్రమార్క రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.
శాసనసభలో మంగళవారం గవర్నర్ ప్రసంగా నికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ మాట్లాడారు. మహిళలపైన గౌరవం ఉంది కాబట్టే మొదటి సమావేశాల్లోనే సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పామని, మాకు మహిళలకు గౌరవం ఉంది కాబట్టి ఇతరుల మాదిరిగా మేము సోనియా గాంధీని ‘బలిదేవత’ అనలేదని ఎద్దేవా చేశారు. మహిళా ఆత్మగౌరవం గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు మహిళా మంత్రి ఇంటిపైకి పోలీసులను పంపిస్తున్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పోయి నిధులు తెస్తారేమో అనుకుంటే.. ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి గవర్నర్ ప్రసంగంలో తమిళసై సౌందర్‌రాజన్ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైలు పైన సీఎం రేవంత్ రెడ్డి సం తకం చేశారని ప్రకటించారని, దీంతో పాటు రాహుల్ గాంధీ కూడా మొదటి క్యాబినెట్లోనే ఆరు గ్యారెంటీలను చట్టబద్ధత తెస్తామని చె ప్పారని, అయినా ఇప్పటిదాకా ఆ ఫైలు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విలువ ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షలు అని, రెండున్నరేళ్లు అవుతు న్నా దీనిద్వారా లబ్ధి కలిగిన ఒక్క కుటుంబమైనా రాష్ట్రంలో ఉన్నదా అని ప్రశ్నించారు.
ఆ రున్నర లక్షల రేషన్ కార్డులను గత ప్రభుత్వం ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే సభలో చెప్పారని, సభలో మంత్రులు చెప్పిన మాటలకు విలువ లేకుండా సభ్యులు అబద్ధాలు చెబితే స్పీకర్ ఆపాలని సూచించారు. సభ బయట ఎలాగో అబద్ధాలే చెప్తున్నారు, కనీసం శాసనసభలోనైనా నిజాలు చెప్పాలని హితవు పలికారు.
మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం అన్న జార్జ్ ఆర్వెల్ మాట ఈరోజు రాష్ట్రానికి సూట్ అవుతుందన్నారు. ఆరు గ్యారెంటీలతో మోసపోయిన మహిళలు, వికలాంగులు, ఆడబిడ్డలు, రైతన్నలు ధన్యవాదాలు చెప్పాలా, టీఏలు, డీఏలు రాక నరక యాతన పడుతున్న పెన్షనర్లు చెప్పాలా అని ప్రశ్నించారు.
కూలగొట్టు.. చెడగొట్టు.. పడగొట్టు అన్నట్టుగా పాలన..
ఇచ్చిన అభయహస్తం అమల్లో మాత్రం భ స్మాసుర హస్తంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన కూలగొట్టు.. చెడగొట్టు.. పడగొట్టు అన్నట్లుగా మారిందని, త్వరలో పరాభ వ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని, కానీ.. ప్రజలకు మాత్రం అన్ని పరిహాస నామ సంవత్సరాలే అన్నారు. 28 నెలల్లో చెప్పుకోవడానికి ఏమున్నదని, బాకీలు-బకాయిలు, డైవర్షన్లు.. కమీషన్లు, బుల్డోజర్ల చప్పుళ్లు.. బూతుల మోతలు, ఆల్‌టైం రికార్డు అప్పులు.. క్యూలైన్లలో చెప్పులు! ఇదే మిగిలిందని ఎద్దేవా చేశారు.
420 ఎగనామాలు.. మూడున్నర కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు..లూటిఫికేషన్లు ఫుల్లు అన్న ట్టు ఉందన్నారు. చెక్ డ్యాముల పేల్చివేత.అడుగడుగునా అణచివేత, క్రెడిట్ చౌర్యం.. భూముల బేరం ఇదే కాంగ్రెస్ తీరు అని మండిపడ్డారు. స్కాములు కళకళ.. స్కీములు వెలవెల, రైతన్నలకు బేడీలు.. నిరుద్యోగుపై లాఠీలు మోగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిరాయింపులు కంపు.. బస్సు చార్జీల వాయింపు, ఫుడ్ పాయిజన్ చావులు.. ఫుట్ బాల్ సరదాలే సరిపోయిందని విమర్శించారు.
గల్లీల్లో చెత్త కుప్పలు.. ఢిల్లీకి విమాన యాత్రలు, మాటలు ధడేల్.. చేతలు తుపేల్ అన్నారు. దరఖాస్తులు.. దఫ్తర్లు.. దండాలు అ న్నట్లు మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి గ్యారెంటీ కార్డులు.. నేడు బాకీ కార్డులు గా మారి వెక్కిరిస్తున్నాయన్నారు. టీ20 వరల్డ్ కప్ పెడితే.. ఇండియా గెలిచిందని, 420 వర ల్ కప్ పెడితే.. మాత్రం మీరే గెలుస్తారని ఎద్దే వా చేశారు.
బ్రహ్మండంగా మందగమనం..
తెలంగాణలో పరిశ్రమలు, పెట్టుబడుల రాక పూర్తిగా తగ్గిపోయిందని, ఐటీ ఉద్యోగా లు తగ్గాయని గవర్నర్ ప్రసంగంలోనే చెప్పారని, ఐటీ శాఖ ఉద్యోగులు తప్పుచేస్తే వారిని సస్పెండ్ చేయాలని సూచించారు. గోబెల్స్ కాన్ఫరెన్సులో చెప్పినవన్నీ తప్పుగానే ఉన్నాయన్నారు. కేబినెట్ అప్రూవ్ చేసిన దాని ప్రకారమే 3 లక్షల 13 వేల కోట్లు ఐటీ ఎగుమతులని, 9 లక్షల 39 వేల ఉద్యోగాలని చెప్పారని, 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9 లక్షల 46 వేలు నమోదు అయితే మరి మీ ప్రభుత్వం వచ్చాక 7 వేల ఉద్యోగాలు తగ్గాయని గవర్నర్ ప్రసంగంలో ఉందని, ఇది వాస్తవమా కాదా? అని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిందని దుష్ప్రచారం చేస్తే నష్టపోయేది రాష్ట్రమేనని అన్నారు. స్టేట్ ఓన్డ్ టాక్స్ రెవెన్యూలో దేశంలోనే ఉత్తమ స్థానంలో తెలంగాణను నిలబె ట్టింది మా ప్రభుత్వమన్నారు. ఒకప్పుడు ఉస్సే న్ బోల్ట్ లెక్క పరిగెత్తిన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తెలంగాణలో ఎందుకు చతికిలపడిందని ప్ర శ్నించారు. కరోనా కాలంలో మాత్రమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉందని, మళ్ళీ కాంగ్రెస్ కాలంలోనే ఇట్లాంటి పరిస్థితి వస్తున్నదని చెప్పారు.
ఉన్న డే ఎకానమీని ఖరాబు చేసి నైట్ ఎకానమీ తీసుకువస్తామంటున్నారని, ఇది నైట్ ఎకానమీ కాదు, దారం తెగిన తెలంగాణ కైట్ ఎకానమీ మాదిరిగా మార్చారని తెలిపారు. రిజిస్ట్రేషన్, వెహికల్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, జీఎస్టీ గ్రోత్ తగ్గిందని, కానీ మందు గమనం మాత్రం బ్ర హ్మాండంగా జరుగుతుందని ఎద్దేవా చేశారు. సారా దుకాణాలు తెరవాలని డిమాండ్లు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా చూస్తున్నామన్నారు.
సీఎం పర్యటనకు నిధులు.. ఫీజు రియింబర్స్‌మెంట్‌కు లేవు..
గవర్నర్ ప్రసంగంలో 20 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అన్నారు, కానీ రూ. 50 వేల కోట్ల రుణమాఫీ అని పేపర్లకి మీరే చెప్పారని, ఏదైనా ఒక గ్రామంలో సంపూర్ణంగా రైతులందరికీ రుణమాఫీ జరిగిందని, రుజువు చేయగలిగితే అదే గ్రామంలో నా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని సవాల్ విసిరారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వలనే రాష్ట్రంలో అత్యధిక వ్యవసాయ ఉత్పాదకత పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తన నివేదికల్లో స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు.
కౌలు రైతులకు 22 లక్షల మందికి రైతుబంధు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వంలోకి వచ్చి న తర్వాత రైతులకు, కౌలు రైతులకు పంగనామం పెట్టారని విమర్శించారు. యూరియా ఇవ్వడానికి ప్రణాళిక లేక మొబైల్ యాప్‌ల్లో ఇస్తామని చెప్పి మభ్యపెడుతున్నారని, యూరి యా షాపుల్లో లేని ఎరువులు మొబైల్ యాప్‌లోలో ఎట్లా ఉంటాయని ప్రశ్నించారు. సీఎం హార్వర్డ్ యూనివర్సిటీలో వెళ్లి వచ్చిన ఖర్చులన్నీ, ఫీజులు, విమాన ఛార్జీలు అన్నింటిని ప్రభుత్వమే చెల్లించిందని, కానీ రూ. 12,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విద్యాశాఖ విద్యార్థులకు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
విద్యా కమిషన్ సిఫారసులు దారుణం..
రాష్ట్రంలోని విద్యార్థులు తమ యూనివర్సిటీ భూములు ఎక్కడ తీసుకుంటారో అని భయపడుతున్నారని, అగ్రికల్చర్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన భూ ములు గుంజుకుంటారనే భయంలో ఉన్నారని తెలిపారు. టీచర్లకు జీతాలెక్కవున్నాయని, ప్రభుత్వ స్కూళ్లు బంద్ చేయాలని, గురుకుల డిగ్రీ కాలేజీలు మూసేయాలని విద్యా కమిషన్ సిఫారసు చేయడం దారుణమన్నారు. ప్రభు త్వం ఏది ప్రారంభించినా ప్రతి దాని వెనుక భూముల పందేరం ఖచ్చితంగా కనిపిస్తుందన్నారు.
రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారు ణంగా ఉందని, ఇప్పటికే 190కి పైగా ఆటో అన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, అవసరమైతే ఏసీ బస్సుల్లో కూడా ఉచితంగా ఇవ్వాలని, దానితోపాటు ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవా లని సూచించారు. ఈ శాసనసభ సమావేశాల్లోనే బీసీ సబ్ ప్లాన్ పెట్టాలని డిమాండ్ చేశారు.
ఏ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా 16 వేల కోట్ల రూపాయలతో మూసీని అభివృద్ధి చేయవచ్చని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 3,200 ఎకరాల భూమి కోసం మూసీని డెవలప్ చేస్తామంటున్నారని చెప్పారు. ’హిల్ట్ పాలసీ’లో కుంభకోణాలు జరగ బోతున్నాయని, వాటికి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని, ఈ భూముల పారిశ్రామిక కేటాయింపు ప్రైవేట్ వ్యక్తులకు చేరితే భవిష్యత్తులో ఇబ్బందులు అవుతాయని సూచించారు.
20 లక్షల ఇండ్లు ఇచ్చిన తర్వాతనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పారని, ఇండ్లు కట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి, కృష్ణా అంశాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతులను ఎండబెట్టొదు..
మా మీద కోపంతో రైతులను ఎండబెట్టవద్దని, మూసీ పైన ఉన్న శ్రద్ధలో వందో వంతయినా పాలమూరు ప్రాజెక్టు పైన ఉంటే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. సింగరేణికి సంబంధించిన టెండర్లలో జరుగుతున్న అవినీతిని పరిశీలించి, టెండర్లను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చేలా స్థానిక బీజేపీ నేతలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
17,770 జీవోలను దాచిపెట్టి ప్రజాపాలన అంటే ఎట్లా? అని, జీవోలన్నీ దాచిపెట్టి ప్రజాపాలన పారదర్శకంగా ఉన్నామంటే ఎవరు నమ్ముతారు?.. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ జీవోలను బయట పెట్టడం లేదని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రీట్వీట్ చేసినందుకు 20 రోజులు జైలుకు పంపిస్తారా? ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నది 75 నాటి ఎమర్జెన్సీ ఇందిరమ్మ రాజ్యమేనని స్పష్టం చేశారు.
జర్నలిస్టుల పైన ఎందుకు ఇంత పగతో ఉన్నారో అర్థం కావట్లేదని, జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్నారు, ప్రెస్‌క్లబ్‌ను కళ్ళు కంపౌండ్ అంటారని, మహిళా జర్నలిస్టులను, జర్నలిస్టులను బట్టలు ఊడదీసి కొట్టాలి అని మాట్లాడతారని, చివరికి అక్రిడిటేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు.
నీరో చక్రవర్తి లాగా.. రేవంత్‌రెడ్డి జీరో చక్రవర్తి..
ఒకప్పుడు నీరో చక్రవర్తి గురించి చూశామని, ఇప్పుడు జీరో చక్రవర్తిని చూస్తున్నా మని.. ప్రజల ఆస్తులను జీరో వాల్యూ చేస్తానని చెప్పిన సీఎం ఈయనే ఉన్నారని విమర్శించారు. టీథుటీ-హబ్‌ను చాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏమో కానీ, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి తరలించాలని ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ ప్రచారాలు చేశారని, కేవలం పొలిటికల్ ప్రాపగాండా కోసం రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకుపోతున్నారని మండిపడ్డారు.
మేము ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలను సేకరించామని, కానీ అక్కడ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలోకి రాకముందు ప్రజలకు తిరిగి ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అక్కడ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి అబద్ధాలు చెప్తున్నదని, ఫార్మా సిటీ భూసేకరణ కేవలం ఫార్మా అవసరాల కోసమే వాడుకోవాలనే నిబంధనలు ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల తుపాకీ పెట్టి బెదిరిస్తే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తారా అని నిలదీశారు. గ్లోబల్ సమ్మిట్ అని ఏర్పాటు చేసిన సమావేశంలోనే ప్రపంచంలోని అనేకమంది ఆర్థికవేత్తలు గత ప్రభుత్వ ఘనత గురించి చెప్పారని పేర్కొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావుతో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి వంటి వాళ్లందరూ కూడా తెలంగాణ సాధించిన అద్భుతమైన ఆర్థిక ప్రగతిని మీ ముందు స్పష్టంగా దిమ్మతిరిగే సమాధానం చెప్పారని విమర్శించారు.
హిరణ్యకశ్యపుడు నారాయణ మంత్రాన్ని నిషేధించినట్టుగానే తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటే సాధ్యమవతుందా అని, తెలంగాణ అణువణువునా, అడుగడుగునా కేసీఆర్ ఆనవాళ్లే ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చున్న సచివాలయం, కమాండ్ కంట్రోల్, ఫ్యూచర్ సిటీ.. చివరికి తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు కదా అన్నారు.
పదేండ్ల కాలంలో 25 శాతం సగటు గ్రోత్ రేటుతో .. ఆకాశమే హద్దుగా రిజిస్ట్రేషన్ ఆదాయం దూసుకెళ్లిందని, ఇప్పడంతా.. నేల చూపులేనన్నారు. గత ఏడాది షాక్ అంచనాలు తగ్గించి ఈ సారి 19వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నారని, అందులో జనవరి నాటికి చేరుకున్నది 64 శాతమే అని, కరోనా తర్వాత ఇది..సెకండ్ లోయస్ట్ అని వెల్లడించారు.
కోటి మంది మహిళలు కోటీశ్వరులైతే 100 ట్రిలియన్ ఎకానమీ..
కోటి మందిని కోటీశ్వరులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, 100 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అయితేనే మహిళలు కోటీశ్వరులవుతారన్న విషయం తెలుసా? అని ప్రశ్నించారు. అయితే వారికి ఎన్నికల్లో ఇచ్చిన రూ. 2,500 నెలకూ ఇస్తామని చెప్పిన డబ్బులు ముందుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి గవర్నర్ ప్రసంగంలోనే లక్ష రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు, దాని సంగతేంటని ప్రశ్నించారు.
మహిళలు రూ. 2,500 కోసం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం, రూ. 4,000 ఆసరా పెన్షన్ కోసం, మీరు ఇస్తామన్న తులం బంగారం కోసము ఎదురుచూస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కిట్ పేరు ఇష్టం లేకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకొని అయినా ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అబద్ధాలు చెప్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం కేవలం 11,921 ఉద్యోగాలు మాత్రమేనని చెప్పారు.
రాహుల్ గాంధీ అశోక్ నగర్ వెళ్లి మొదటి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు అశోక్ నగర్‌తో పాటు రాష్ట్రంలోని యువత అంతా కూడా ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు నిరుద్యోగ భృతి వస్తుందని ఎదురుచూస్తున్నారని చెప్పారు.
ప్రజాధనం.. సమర్పణం..
ఎలక్షన్స్ ముందు మీ మేనిఫెస్టో.. వరాల గుట్టలు పేరుకుపోయాయని, ఎన్నికల తర్వాత మీ మేనిఫెస్టో.. చిత్రగుప్తుడి చిట్టా లెక్క మారిందన్నారు. ఓట్లకు ముందు దానకర్ణ.. ఓట్ల తర్వాత కుంభకర్ణ మాదిరి సీఎం తీరు ఉందన్నారు. భారతదేశ ఎన్నికల చరిత్రలోనే కాదు.. ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలో కూడా ఇట్లాంటి బురిడీ మేనిఫెస్టో లేదని చెప్పారు. సమావేశాలు.. సమీక్షలు.. ఆఖరికి కేబినెట్ భేటీలు కూడా ఢిల్లీలో జరుగుతున్నట్టున్నాయని ఎద్దే వా చేశారు.
ఎల్లయ్య గొంగడి ఎక్కడ వుం దంటే.. ఎక్కడ ఏసిన్నో అక్కడే వుంది అన్నట్టు గా పాలన మారిందన్నారు. నిన్న హామీల వ రద.. ఇప్పుడు బూతుల బురద, నిన్న డిక్లరేషన్ల మోత.. ఇప్పుడు ఎగవేతల జాతా, ఇచ్చిం ది గ్యారెంటీలు తాటాకంత.. అమలు చేసింది చింతాకంత, ఇస్తామన్నది ఏనుగు.. ఇచ్చింది ఎలుక, పని చారాణా..ప్రచారం బారాణా, మాటలు కోటలు దాటుతున్నాయి.. కాళ్లు తంగేళ్లు దాటట్లేదన్నారు.
ఇక్కడ జనం అచ్చ తెలుగులో గోడు వెళ్లబోసుకుంటున్నారని, మీరేమో... మలయాళం.. మరాఠీ.. బిహరీ.. హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ జనం సొమ్ముతో.. ఇతర రా ష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలా అని ప్రశ్నించారు.
ప్రజాధనం.. కాంగ్రెస్ క్యాంపెయిన్‌కు సమర్పణం చేస్తున్నారని, జరగనివి జరిగినట్టు.. చేయనవి చేసినట్టు.. లేనివి ఉన్న ట్టు.. అంతా కనికట్టు యాడ్స్ వేసి బహు భాష ల్లో బయటి రాష్ట్రాల వాళ్లను కూడా మోసం చేస్తున్నారని తెలిపారు. పీస సర్కార్ మాయాజలాన్ని పీసీసీ మాయాజాలం మించిపో యిందని ఎద్దేవా చేశారు.




