22ఏ భూముల్లో ప్రతి అర్హుడికీ న్యాయం
- కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు
- అర్హుల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
- కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రతి పేదవాడికీ, నిజమైన భూహక్కుదారుడికీ న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన వారి హక్కులను కాపాడటం, అదే సమయంలో ప్రభుత్వ భూములను రక్షించడం అనే రెండు లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. వివాదాలు లేని ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలోని 22ఏ నిషేధిత భూములకు సంబంధించి వివిధ మాధ్యమాల్లో వచ్చిన కథనాలు, ప్రజల ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యూర్ పరిధి జిల్లాలకు సంబంధించినదైనా, ఇందులో ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
22ఏ అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధికారులు పూర్తిగా అర్థం చేసుకుని అదే స్ఫూర్తితో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. అర్హులైన వ్యక్తికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో ప్రభుత్వ భూములు కాపాడటం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత అని అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి, చట్టబద్ధంగా, నిబంధనల మేరకు అర్హత ఉన్న భూములను గుర్తిస్తూ, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
22ఏ దరఖాస్తులు, ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు. తహసీల్దార్, ఆర్డీవో, సబ్ కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో వచ్చే ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి న్యాయం చేయాలన్నారు.
ప్రజావాణిలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను కూడా ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే విచారణ పూర్తి చేసి పరిష్కరించాలన్నారు. 22ఏ భూముల వివాదాల పరిష్కారానికి హైకోర్టు నిర్దేశించిన 45రోజుల గడువులోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల హక్కులు, ప్రభుత్వ ప్రయోజనాలు రెండింటి నీ సమతుల్యంచేస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.






