బడి బస్.. ఫిట్‌లెస్!
తనిఖీల్లో సరైన పత్రాలు చూపని 25 స్కూల్ బస్సులు సీజ్
పాఠశాలల ప్రారంభంతో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు
హైదరాబాద్‌లో ఫిట్‌నెస్ లేని బస్సులు 367
పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలకు ఉండాల్సిన పత్రాలను తనిఖీ చేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీఏ కార్యాలయాలకు స్వచ్ఛందంగా వెళ్లి సంబంధిత వాహనాల పత్రాలను రెన్యూవల్ చేసుకునే పనిలో విద్యాసంస్థలు నిమగ్నమయ్యాయి.
కానీ ప్రభుత్వ నిబంధనలు అంటే లెక్క చేయని వారు, ప్రభుత్వ మార్గదర్శకాలను పట్టించుకోని వారు ఎలాంటి పత్రాలు లేకుండానే వాహనాలను రోడ్డుపై దర్జాగా నడుపుతున్నట్టు ఆర్టీఏ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వ రూల్స్‌ను బేఖాతర్ చేస్తూ రోడ్డెక్కుతున్న వాహనాలపై హైదరాబాద్ రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి) : 2024 విద్యా సంవత్సరం ప్రారం భం కావడంతో రవాణా శాఖ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలు నడిపే బస్సుల తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఖైరతాబాద్, మల క్‌పేట, బహదూర్‌పురా, తిరుమలగిరి, టోలి చౌకీ ప్రాంతాల ఆర్టీఏ కార్యాలయాల పరిధి లో మొత్తం 1,290 విద్యాసంస్థలకు చెందిన బస్సుల వివరాలు నమోదై ఉన్నా యి.
ఈ నేపథ్యంలో ఆయా బస్సులు ఆర్టీఏ అధికారులు నిర్వహించే ఫిట్‌నెస్ పరీక్షలకు కచ్చి తంగా హాజరు కావాల్సి ఉంది. అయితే, ఇప్పటికే కొన్ని బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేశారు. మిగిలిన విద్యాసంస్థల బస్సులను సామర్థ్య పరీక్షలకు తీసుకురాకపోవడంతో హైదరాబాద్ జేటీసీ ఆదేశాల మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సుల తనిఖీలు ప్రారంభించారు.
25 బస్సుల సీజ్..
బుధవారం స్కూల్స్ ప్రారంభం కావడం తో ఫిట్‌నెస్ లేని బస్సులను తనిఖీ చేసేందుకు రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు ముమ్మరం చేశారు. మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు బలరామ్, రాధిక ఆధ్వర్యంలోని బృందాలు తనిఖీలు నిర్వహించి నగరంలోని పలు ప్రాంతాల్లో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని, ట్యాక్స్, పర్మిట్ తదితర పత్రాలు లేని 25 బస్సులను సీజ్ చేశారు. ఆర్టీఏ నిబంధనల కు అనుగుణంగా యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు.
ఫిట్‌నెస్ పొందని 367 బస్సులు..
హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ఇప్పటి దాకా 923 స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు రెన్యూవల్ చేశారు. మరో 367 బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంది. సామర్థ్య పరీక్షలకు హాజరుకాని స్కూల్ బస్సులు తక్షణమే ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లతో పాటు నిబంధనలకు అనుగుణంగా స్కూల్ బస్సుల నిర్వహణ లేకుంటే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జేటీసీ సీ రమేశ్ హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లాలో 12 బస్సులు సీజ్..
మేడ్చల్, జూన్ 12 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎంవీఐలు పాఠశాలల బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భం గా నిబంధనలు పాటించని 12 బస్సులను సీజ్ చేసినట్లు డీటీవో రఘునందన్ తెలిపారు.






