16 July, 2026 | 4:29 PM

వర్షానికి నేల కూలిన కళాశాల కాంపౌండ్ వాల్

06-06-2024 11:53 AM

నిర్మాణం చేసి ఏడాది కాకుండానే బయటపడ్డ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం

 కళాశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని సైన్స్ డిగ్రీ కళాశాల కాంపౌండ్ గోడ చిన్నపాటి వర్షానికే నేల కూలింది. ప్రహరీ గోడ నిర్మించి ఏడాది పూర్తికాకముందే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం బట్టబయలైంది. కళాశాల భూమి ఐదెకరాల 10 గుంటలకు గాను ప్రస్తుతం నాలుగు ఎకరాలకు మించి లేదని ఆరోపణలు జోరందుకున్నాయి.  కళాశాల ప్రహరీ గోడ నిర్మించే క్రమంలోనే వాస్తు దోషం అనే పేరుతో కోట్లు విలువచేసే సుమారు ఎకరం స్థలంను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై కళాశాల భూమిని కాజేసారనే విమర్శలున్నాయి.

ప్రహరీ గోడ నిర్మాణం కోసం కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సైతం తీవ్ర అవినీతికి పాల్పడి నాసిరకంగా గోడ నిర్మించారని ప్రస్తుతం గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి పూర్తిగా అది నేలమట్టం కావడంతో నాసిరకమైన నిర్మాణం బయటపడిందని చర్చ జరుగుతోంది. నిర్మాణానికి సంబంధించిన బిల్లులు సైతం రెండు నెలల కింద మంజూరయ్యాయని ప్రస్తుతం నేలమట్టమైన కాంపౌండ్ వాల్ తిరిగి పునర్నిర్మించేలా సదురు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాసిరకమైన ప్రహరీ గోడ నిర్మిస్తున్నట్లు గతంలోనే ఆరోపణలు వచ్చినా సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ ఇతర అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.