19 May, 2026 | 4:57 AM

ఠాణాలో కీచకుడు!

20-06-2024 12:26 AM
  • మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై లైంగిక దాడి

రివాల్వర్‌తో బెదిరించి అఘాయిత్యం 

ఎస్సైపై కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు

కాళేశ్వరంలో వెలుగుచూసిన ఘటన

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 19(విజయక్రాంతి): శాంతిభద్రతలను పరిరక్షిస్తూ.. నిబద్ధతతో పనిచేస్తూ కిందిస్థాయి సిబ్బందికి ఆదర్శంగా నిలవా ల్సిన ఎస్సై కామాంధుడిగా మారాడు. రివాల్వర్‌తో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో వెలుగు చూసింది.

పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టే బుల్‌పై ఇదే స్టేషన్ ఎస్సై భవానీసేన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎస్సై కొద్దిరోజుల క్రితం మహిళా కానిస్టేబుల్‌కు కాల్ చేసి, తాను లేవలేని స్థితిలో ఉన్నానని, కొంచెం సాయం చేసేందుకు ఇంటికి రావాలని కోరాడు. దీంతో ఆమె ఇంటికి వెళ్లింది. ఎస్సై ఆమెను సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఎస్పీ విచారణకు ఆదేశించగా.. మంగళవారం పోలీస్ ఉన్నతాధికారులు కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేపట్టారు.

విచారణలో ఎస్సై లైంగికదాడికి పాల్పడినట్లు తేలడంతో ఎస్సై భవాని సేన్ అరెస్టుకు ఆదేశించారు. పోలీసులు బుధవారం ఎస్సైని కస్టడీలోకి తీసుకున్నారు. అతడి నుంచి సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో పని చేసినప్పు డూ ఓ యువతితో ఇదే ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాడు పోలీస్ అధికారులు ఆయనను సస్పెండ్ కూడా చేశారు. అయినప్పటికీ ఎస్సైలో పరివర్తన రాలేదు. మహిళా కానిస్టేబుల్‌పై లైంగికదాడి విషయంపై రాష్ట్రప్రభుత్వం సీరియస్ అయింది. ఎస్సై భవాని సేన్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు మల్టీజోన్ ఐజీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు.

సీఎం సీరియస్

కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ అఘాయిత్యంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వ్యవహారంపై ఆరా తీశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.