కామారెడ్డిలో అడ్డగోలు ‘కట్టుబాట్లు’!
- అనుమతులు లేకుండానే బహుళ అంతస్థులు
అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రసన్నమే పర్మిషన్లు
మామూళ్ల మత్తు.. సర్కారు ఆదాయం చిత్తు
కామారెడ్డి, జూన్ 1౯ (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లాలో అక్రమ భవనాల నిర్మాణాల జోరు కొనసాగుతోంది. జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాల్లో అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిదులను ప్రసన్నం చేసుకుంటే చాలు అనే దోరణీలో భవన యజమానులు ఉన్నారు. నిబంధనలు అక్కరలేదు, అధికారులు, ప్రజా ప్రతినిధుల అండ ఉంటే సరిపాయే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.
దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య కొట్లాటకు దారి తీస్తోంది. తమ అనుచరులు నిర్మించారంటే, తమ అనుచరులు నిర్మించారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి అక్రమ భవనాల నిర్మాణాలు, అనుమతులు లేకుండా నిర్మించి, రోడ్లను ఆక్రమించిన వారి ఇండ్లను కూల్చివేస్తామని సమావేశం నిర్వహించగా ప్రజలు రెండు నెలల గడువు కోరారు.
జోరుగా బహుళ అంతస్తుల నిర్మాణాలు
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, పట్టణాలలో బహుళ అంతస్థుల నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. చిన్న భవనం నిర్మించుకోవాలన్నా అధికారుల అనుమతులు తీసుకు న్నా కూడా సవాలక్ష కొర్రీలు పెడుతూ అడ్డుకుంటున్న అధికారుల తీరు ఒకవైపు ఉంటే, జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాలలో అక్రమ బహుళ అంతస్తుల భవనాల నిర్మా ణం జోరుగా సాగుతున్నాయి. తాము అన్ని అనుమతు లు తీసుకొని దర్జాగా నిర్మిస్తున్నట్లు మరికొందరు డాంబికాలు పలుకుతున్న వారు కొందరైతే, మరికొందరు భవన యజమానులు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా భవనాల నిర్మాణాలను చేపడుతున్నారు.
మరికొందరు నిబంధనలను తుంగలో తొక్కి, నిర్మించి భవనాలను అద్దెలకు ఇస్తున్నారు. నెలకు లక్షల్లో అద్దెలు పొందుతున్నారు. ఇది అంతా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియకుం డా జరుగుతున్నదంటే ముక్కున వేలు వేసుకోవాల్సిందే మరి! ఎవరి నుంచి అనుమతి తీసుకున్నారో చూపాలని అడిగితే బిక్కమొహం వేస్తూ, తాము అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపడుతున్నా మని బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ యజమానులు జవాబు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు అనుమతులు లేకుండానే వందల సంఖ్యలో దర్జాగా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
అండ ఉంటే చాలు..
యజమానులు మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధుల అండ ఉంటే తమకు చాలు అనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. వారికి అడిగిన కాడికి ముడుపులు ముట్టజెప్పి, అక్రమంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, దర్జాగా భవనాలను నిర్మిస్తున్నారు. ఇంటి పర్మిషన్ తీసుకొని, వ్యాపార సముదాయాలను నిర్మిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక ఏడాదిలోనే ౨౦౦కు పైగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతు లు లేకుండానే బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. అధికారులు బహుళ అంతస్తుల నిర్మాణాలను కనీసం చూడడం లేదు.
అనుమతుల కోసం దరఖాస్తు చేస్తున్న బిల్డర్లు, టౌన్‌ప్లానింగ్ ప్రైవేట్ ఇంజినీర్లు, భవన నిర్మాణ యజమానుల నుంచి డబ్బులు తీసుకొని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అడిగిన కాడికి ముడుపులు అప్పగించి, అనుమతులు లేకుండానే భవనాలను నిర్మిస్తు న్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల అండ ఉంటే తమకు అడ్డు చేప్పేవారు ఎవరు? అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, అక్రమ నిర్మాణాలను జోరుగా సాగిస్తున్నారు. ప్రభుత్వా నికి సంవత్సరానికి ఒక బహుళ అంతస్తు భవనానికి లక్షల్లో ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా, అనుమతులు లేకుండానే నిర్మించి, ట్యాక్స్‌ను ఎగవేస్తున్నారు.
ఇలాంటి తతంగం జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పట్టణాలలో, వివిద మండల కేంద్రాలలో కూడా బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. పర్యవేక్షిం చాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే, అధికారులు పరిశీలిస్తామని జవాబు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. భవన యజమానికి ఫిర్యాదు చేసినవారి పేర్లను చేరవేస్తున్నారు. దీంతో వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవడం లేదు.
అనుమతులు లేకుండా నిర్మిస్తే చర్యలు తప్పవు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నట్లయితే, వారిపై చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. భవన నిర్మాణాల అనుమతుల కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌లను పర్యవేక్షణకు పంపడమే కాకుండా, పంచాయితీ రాజ్, ఇరిగేషన్ ఏఈలు పరిశీలించిన అనంతరమే, భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాం. అనుమతులు లేకుండా బహుళ అంతస్తులను నిర్మిస్తే, తప్పకుండా కూల్చివేస్తాం. లేకుంటే జరిమానాలు విధిస్తాం.
-సుజాత, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి






