13-12-2025 08:09:10 AM
- ప్రభావం చూపనున్న తొలి విడత ఎన్నికల ఫలితాలు.
- స్పీడ్ పెంచిన పార్టీ నేతలు, అభ్యర్థులు.
- గ్రామాల్లోకి భారీగా డబ్బు, మద్యం.
- గ్రామాల్లో నిర్విరామంగా తయారవుతున్న కల్తీకల్లు.
- ప్రేక్షక పాత్రలో అధికారులు
- కల్తీ కల్లు, మద్యం మత్తులోకి ఓటర్లు.
- ఎవరి ధీమాలో వారే..
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనుండగా మొదటి విడత ఈ నెల 11న ప్రశాంతంగా ముగిసింది. వాటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా రెండో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల అభ్యర్థుల్లో భయాందోళన మొదలైంది. మొదటి విడత ఎన్నికల్లో ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా రెబల్ అభ్యర్థులు నిల్చున్న చోట తీవ్ర పరాభావం ఎదురైంది. ఆయా ప్రధాన పార్టీల ముఖ్య నేతల అలసత్వం, అహంకారం, అవగాహన లోపంతోనే సమన్వయం చేయలేక కొన్ని చోట్ల ముఖ్య నేతలు ఓటమి చెందారని లోలోపలే మదన పడుతున్న పరిస్థితి.
ఆయా ప్రాంతాల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు లక్షల్లో ఖర్చు చేసుకున్నా ఫలితం దక్కకపోవడంతో వాటిని నుండి గుణపాటాన్ని నేర్చేలా రెండో విడత ఎన్నికల్లో తమ సత్తా చాటేలా పావులు కదుపుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఎన్నికల ప్రచారం మిగిలి ఉండడంతో అన్ని పార్టీల నేతలు అభ్యర్థులు రికామ్ లేకుండా ప్రచారంలో పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటల నుండి ఎన్నికల సంఘం నిబంధన మేరకు అన్ని ప్రచారాలు నిలిపివేయడంతో ఎక్కడికక్కడ ర్యాలీలు మైక్ సెట్ ఇతర ప్రచార ఆర్భాటాన్ని ముగించారు.
అనంతరం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కుల సంఘాలు మహిళా సంఘాలను రంగంలోకి దించారు. ఒక్కో ఓటు ధర సుమారు మూడు నుండి ఐదు వేల వరకు రేటు నిర్ణయించినట్లు కొన్ని గ్రామాల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారట. మరి కొన్నిచోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా సంబంధిత శాఖ అధికారులే మద్యం డబ్బు పంపిణీ కోసం అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
భారీగా ముడుపులు అందుకున్న కొంతమంది అధికారులు నిబంధనలను అతిక్రమించినా అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ కల్లు, మద్యం, మరికొన్ని చోట్ల కల్తీ మద్యం పంపిణీ చేస్తున్నా పట్టించుకోక పోవడంతో అవి గమనించని ఓటర్ల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని యువత ఆరోపిస్తోంది. రెండో విడత ఎన్నికలు ఈనెల 14న జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏడు మండలాలు 151 గ్రామపంచాయతీలకు గాను 1,046 మంది నామినేషన్లు దాఖలు చేయగా వీరిలో విత్ డ్రా చేసుకున్న వారి మినహ 473 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఎనిమిది గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం కాగా 1,412 వార్డు సభ్యులకు గాను 3,810 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. విత్ డ్రా చేసుకున్న వారి మినహా 3,229 మంది అభ్యర్థులు వార్డు సభ్యులు బరిలో నిలిచున్నారు. ఇందులో 142 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకోసం 4,106 మంది పిఓ, ఏపీవో లు ఎన్నికల సిబ్బంది పనిచేస్తున్నారు.
ముఖ్య నేతల సొంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్న తన తండ్రి కూచుకుల్ల దామోదర్ రెడ్డి సొంత గ్రామం తూడుకుర్తిలో బలపరిచిన అభ్యర్థి ఎలాగైనా గెలవాలని స్వయంగా రంగంలోకి దిగారు. కానీ ఎంతోకాలంగా ప్రధాన అనుచరుడిగా ఉన్న మరో వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలవడంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నువ్వా నేనా అనే రీతిలో రెండు ప్రధాన పార్టీ ముఖ్య నేతలు ప్రచారం ముమ్మరం చేయడంతో ఓటర్లు ఎటు తేల్చుకోలేక సతమతపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసుకునేందుకు రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు మద్యం డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నట్లు ఇతర పార్టీల అభ్యర్థులు ఓటర్లు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా ఫీల్డ్ కవర్లను ఏర్పాటు చేసి ప్రతి ఓటర్కి వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సొంత గ్రామం తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామంలోనూ రెండు ప్రధాన పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లకు మాత్రం కేవలం కల్తీకల్లు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.