13-12-2025 08:40:23 AM
హైదరాబాద్: ప్రపంచ స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ శనివారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. భారత ఫుట్ బాల్ అభిమానులంతా మెస్సీ రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఇవాళ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ వస్తున్న మెస్సీ బృందానికి భారీ స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయంలో అన్ని ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రానున్న లియోనల్ మెస్సీతో పాటు రోడ్రిగో, లూయిస్ రానున్నారు. వారు విమానాశ్రయం నుంచి నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్ కు వెళ్తారు. మెస్సీ రాక సందర్భంగా ఎయిర్ పోర్టు నుంచి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్ లో 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్న మెస్సీ సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. తొలుత 30 మంది పిల్లలకు ఫుట్ బాల్ ట్రైనింగ్ ఇవ్వనున్న లియోనల్ మెస్సీ చివరి ఐదు నిమిషాలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి జట్టుతో ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడతారు. విన్నర్, రన్నరప్ జట్లకు రేవంత్ రెడ్డి, మెస్సీ గోట్ కప్ అందించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరుపున మెస్సీని ముఖ్యమంత్రి సన్మానించనున్నారు.