13-12-2025 09:08:13 AM
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు శనివారం కావడంతో భక్తుల రద్దీ ఒకింత ఎక్కువగానే ఉంది. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగానే సమయం, టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం, రూ.300 ప్రత్యేక టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.నిన్న తిరుమల శ్రీవారిని 67,202 మంది భక్తులు దర్శించుకోగా, వీరిలో 25,864 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల వెంకన్న హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) ప్రకటించింది.
చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. తిరుమలలో సాధారణ రోజుల్లోనే చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు పరిస్థితిని గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. తిరుమలకు వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.