13-12-2025 08:02:49 AM
గో బ్యాక్ జూపల్లి అంటూ గ్రామస్తుల ఆందోళన
పెంట్లవెల్లి: పెంట్లవెల్లి మండలం గోపులాపూర్ గ్రామంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర నిరసనకు గురయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గ్రామం సందర్శనకు వచ్చిన మంత్రి ఎదురుచూడని పరిస్థితులను ఎదుర్కొన్నారు. జూపల్లి గో బ్యాక్… జూపల్లి డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచార సభలో మాట్లాడుతున్న సమయంలోనే గ్రామస్తులు మంత్రిని అడ్డుకున్నారు.
అందుకు మంత్రి జూపల్లి స్పందిస్తూ పూటకో మాట, రోజుకో మాట మాట్లాడే నేతను కాదు నేను. 40 ఏళ్లుగా నిజాయితీగా కాంగ్రెస్‌లో ఉన్నాను. ఒక సందర్భంలో తప్ప పార్టీ మార్చలేదని చెప్పడం సరికి గ్రామస్తులు ఆందోళన ఉదృతం చేశారు. పూటకో పార్టీ మార్చిన ఘన చరిత్ర నీదే అంటూ మంత్రిని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ అభ్యర్థి లేకపోవడంతో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ బంద్ పెట్టిన మహిళను కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు తేవడం సిగ్గుచేటని గ్రామస్తులు విమర్శించారు.
గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని ఓటమి భయంతో మంత్రి అసత్య ప్రచారం చేయడానికి వచ్చారని గ్రామస్తులు మండిపడ్డారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రి పదవిలో ఉన్నప్పటికీ అభివృద్ధి ఏమీలేదని, గ్రామానికి మీరు ఏమి చేశారనే ప్రశ్నలతో గ్రామస్తులు మంత్రిని ఇరుకున పెట్టారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గ్రామస్థుల ఆగ్రహం పెరగడంతో, తీవ్ర నినాదాల నడుమ మంత్రి జూపల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు.