calender_icon.png 4 August, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతితో రైతుల భూములకు భరోసా

19-04-2025 07:14:01 PM

జిల్లా కలెక్టర్ పమేల సత్పతి..

హుజురాబాద్ (విజయక్రాంతి): రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి(District Collector Pamela Satpathy) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ భూభారతి చట్టం (భూమి హక్కుల రికార్డు చట్టం)-2025 పైఅవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు వారి భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.

ధరణి పోర్టల్ లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా లభించునుందని అన్నారు. రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని, తదుపరి భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే భూ భారతి చట్టాలు ప్రకారం అప్పిలు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. గతంలో తహసిల్దారు పరిష్కరించే చిన్న చిన్న సమస్యలు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చేవని, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం వల్ల పరిష్కరించడంలో జాప్యం జరిగేదని తెలిపారు.

భూభారతి ద్వారా కింది స్థాయి అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించారని దీనివల్ల భూమికి సంబంధించిన చిన్న సమస్యలు మండల స్థాయిలోని సత్వరం పరిష్కారం అవుతాయని తెలిపారు. ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు 33 మాడ్యూల్స్ పొందుపరచాలని, దీనివల్ల ఏ సమస్యకు ఏ మాడ్యూల్ లో దరఖాస్తు చేయాలో అర్థం కాకుండా ఉండేదని అన్నారు. భూభారతిలో 4 మాడ్యూల్స్ మాత్రమే ఉండి సులభమైన దరఖాస్తు ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

ధరణిలో సవరణకు, సమస్యల పరిష్కారానికి, కింది స్థాయి అధికారులకు ఎటువంటి అధికారాలు లేనందున వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉండేవని, ఆరు నెలల క్రితం అధికారాలు విభజించడం ద్వారా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయని అన్నారు. భూములకు సంబంధించిన అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం దొరికిందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో ఇలాంటి ఆవకాశము లేదని తెలిపారు. భూభారతి చట్టం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఎంతోమంది మేధావులు, అధికారులు భూభారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ తహసీల్దార్ కనకయ్య, రెవిన్యూ, వ్యవసాయ, పంచాయతీ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.