04-08-2025 01:37:32 PM
హైదరాబాద్: పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని.. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ఎమ్మెల్యేల మెరుపు ధర్నాకు దిగారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అసెంబ్లీ లో స్పీకర్ అందుబాటులో లేక పోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు స్పీకర్ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో సమయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ అందుబాటులో లేరని ఆయన సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) మీడియాతో మాట్లాడుతూ... ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నామని డిమాండ్ చేశారు. స్పీకర్ తో కేటీఆర్ మాట్లాడారు... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తారని చెప్పారని సూచించారు. ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చారు. స్పీకర్ ఇంకా రాలేదు... స్పీకర్ కార్యాలయం వైపు వెళ్లే ద్వారం కూడా తెరవలేదన్నారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సభాపతిని కోరుతున్నామని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.