04-08-2025 02:28:24 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక్కరిదే కాదని అందరిదని,5 బెడ్ రూములు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, స్టాఫ్ క్వార్టర్స్, సెక్యూరిటీ గదులతో అత్యంత అదనాతన సౌకర్యాలతో నల్గొండ పట్టణం నడిబొడ్డున నిర్మించిన నల్గొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మినిస్టర్ బంగ్లాకు "ఇందిరా భవన్" అని పేరు పెడుతున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం అయన ప్రారంభించారు.
పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా క్లాక్ టవర్ సెంటర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించామని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే ఒక్కడిదే కాదని అందరిదని ,రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నల్గొండకు వచ్చినప్పుడు వసతి ఉండే విధంగా క్యాంపు కార్యాలయాన్ని నిర్మించామని తెలిపారు. అందుకే ఈ కార్యాలయానికి "ఇందిర భవన్" అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నాయని, అంతేకాక ఆయా నియోజకవర్గాలలో కొత్త పనులు మంజూరయ్యాయని తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో తహసిల్దార్, ఎంపీడీవో ,పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు 20 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మొదటి ఫైల్ పై సంతకం పెట్టారు.