హక్కుల సాధనే పీఎస్హెచ్ఎమ్ఏ సంఘం ప్రధాన ధ్యేయం
గణపురం,జులై 27 (విజయ క్రాంతి): హక్కుల సాధనే పీఎస్హెచ్ఎమ్ఏ సంఘం ప్రధాన ధ్యేయమని పీఎస్హెచ్‌ఎమ్‌ఏ జయశంకర్ జిల్లా అధ్యక్షుడు ఎల్. గణపతి, ప్రధాన కార్యదర్శి పంచిక భగవాన్ రెడ్డి లు అన్నారు. సోమవారం ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులు గణపురం మోడల్ స్కూల్ శిక్షణ కేంద్రంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎల్. గణపతి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలకు ప్రతికూలంగా ఉన్న జీవో 25ను సవరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే 50 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేసి, పే యూనిట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి పంచిక భగవాన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరికీ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని, ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారం, వారి హక్కులు, సౌకర్యాల కోసం సంఘం కృషి చేస్తూ విద్యా అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు టి. రాజిరెడ్డి, ఎల్. రమేష్ నాయక్, పసుల భద్రయ్య, బి. శ్రీనివాస్, కె. శ్రీనివాస్ రెడ్డి, బిల్ల విజయ, గీతారాణి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






