8 August, 2026 | 2:32 AM

విత్తన తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి

08-08-2026 12:31 AM

వెంకటాపూర్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్ లో వరి సాగు చేస్తున్న రైతులు ఈ నెల 10వ తేదీలోగా విత్తన నమోదు ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎం. శైలజ సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ పథకాల అమలు, పంటల వివరాల నమోదు, రైతులకు అవసరమైన సేవలు సకాలంలో అందించేందుకు విత్తన నమోదు కీలకమని ఆమె తెలిపారు.

విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తాము విత్తనాలు తీసుకున్న ఎరువులు, విత్తనాల డీలర్ల వద్దకు వెళ్లి పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్ కార్డు సమర్పించి ప్రభుత్వం సూచించిన ఏ రకం వరి విత్తనాన్ని సాగు చేశారో నమోదు చేయించుకోవాలని సూచించారు. విత్తనాల వివరాలను సక్రమంగా నమోదు చేయడం ద్వారా రైతుల సాగు వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతాయని తెలిపారు.

సొంతంగా దాచుకున్న లేదా ఇతర మార్గాల ద్వారా సేకరించిన విత్తనాలను వినియోగించిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి విత్తన నమోదు పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత నమోదు చేసే అవకాశం ఉండకపోవచ్చని, అందువల్ల రైతులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే నమోదు చేయించుకోవాలని సూచించారు.