స్వాతంత్య్ర పోరాటంలో సేవాదళ్‌దే కీలకపాత్ర
ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలి
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నముక
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): దేశ స్వాతంత్య్ర పోరా టం నుంచి నేటి వరకు సేవదళ్ అప్రతిహతంగా తన సేవలను కొనసాగిస్తోందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్ర భుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సేవాదళ్ ఎండగడుతుందని అన్నారు.
నాం పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితెందర్ ఆధ్వర్యంలో ‘సమర్థ శిక్షణ శిబిరం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం దేశంలోని స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
దేశంలో రాజ్యాంగ విలువల రక్షణకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, నేడు తన కూతురు కవిత అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ను ఆదరించిన ప్రజలు, ఇప్పుడు ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఈ ఘనత (క్రెడిట్) అంతా సోనియా గాంధీకే దక్కుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
తెలంగాణ కోసం సోనియా గాంధీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే.. కేసీఆర్ తన పాలనతో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టారు అని మండిపడ్డారు. తెలంగాణ పునర్నిర్మాణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌కి సేవాదళ్ వెన్నుముక వంటిదన్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందిం చుకునేందుకు ఇలాంటి శిక్షణ ఎంతో అవసరమని చెప్పారు. పార్టీ నేతలు, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.






