28 August, 2026 | 3:12 AM

సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత

28-08-2026 12:00 AM

టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జీవీ నారాయణ రావు 1953 సెప్టెంబర్ 9న కృష్ణా జిల్లాలోని కురుమద్దాలి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి జీ ప్రసాదరావు డిస్ట్రిబ్యూటర్‌గా, ప్రముఖ సారథి స్టూడియోకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందిన నారాయణరావు.. 1976లో లెజెండరీ దర్శకుడు కే బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలిచిత్రంలో ‘తాళికట్టు శుభవేళ’ పాటలో ఆయన అద్భుత నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ప్రతిష్టాత్మక నంది అవార్డు అందుకున్నారు. ‘ఒక ఊరి కథ’ (1977) సినిమాలో నటనకు గానూ ఆయనకు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. 

నటుడిగా, నిర్మాతగా.. 

జీవీ నారాయణ రావు దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. ‘ముత్యాల పల్లకి’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘అంగడి బొమ్మ’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.

నిర్మాతగా మారి తన సొంత బ్యానర్లు అయిన ‘దమయంతి ఆర్ట్ పిక్చర్స్’, ‘డైనమిక్ మూవీ మేకర్స్’పై ‘దేవాంతకుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘యముడికి మొగుడు’, ‘పెళ్లి నీకు శుభం నాకు సినిమాలను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన నిర్మించిన ‘దేవాంతకుడు’ (1984), ‘యముడికి మొగుడు’ (1988) చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ‘యముడికి మొగుడు’ చిత్రాన్ని తర్వాత తమిళంలో రజనీకాంత్‌తో రీమేక్ చేశారు. ‘పసివాడి ప్రాణం’ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషించారు. 

స్టార్స్‌తో అనుబంధం.. 

జీవీ నారాయణరావు మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నటుడు సుధాకర్ ఆయనకు ప్రాణస్నేహితులు. రజనీకాంత్‌ను ‘అరే రజనీ’ అని పిలిచేంత ఆత్మీయ చనువు ఆయనకు ఉండేది. ఆయన నటించిన చివరి చిత్రం ‘ఆలోచన’. ఇది త్వరలో విడుదల కానుంది. 

నేడు అంత్యక్రియలు.. 

జీవీ నారాయణ రావు అంత్యక్రియలు శుక్రవారం ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని మహాప్రస్థానంలోని మార్చురీలో భద్రపరిచారు. ఆయనకు భార్య గుళ్లపల్లి అనురాధ, కుమారుడు అవినాష్, కూతురు లలిత యామిని ఉన్నారు. అమెరికా నుంచి కుమారుడు, యూకేలో ఉంటున్న కుమార్తె హైదరాబాద్ చేరుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

చిరంజీవి సంతాపం.. 

జీవీ నారాయణ రావు మృతి పట్ల అగ్రనటుడు చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. “నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నారాయణ రావుతో నాకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను” అని పోస్ట్‌లో పేర్కొన్నారు.