13-12-2025 12:00:00 AM
టేకులపల్లి, డిసెంబర్ 12,(విజయక్రాంతి): ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్య దళ్ సింగ్, ఆయన భార్య చుక్కల బోడు మాజీ సర్పంచ్ గంగాబాయి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం టేకులపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో 1987లో ప్రారంభమైన తన రాజకీయ జీవితం 2025లో ఆ పార్టీతో బంధం తెగిపోవడం తన గుండెలు పగిలే విషయమన్నారు.
టేకులపల్లి మండలానికి చెందిన దివంగత నేతలు గోనెల నారాయణ, మాజీ మంత్రి రామ్రెడ్డి వెంకట్ రెడ్డి శిష్యుడిగా, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఎందరో పార్టీలు మారుతూ వచ్చినా మండలంలో తానొక్కడినే పార్టీ మారకుండా ఉండి కాంగ్రెస్ ఉనికి కోల్పోకుండా చూసినట్లు తెలిపారు.
అటువంటి తనను పార్టీలో ఎన్నో అవమానాలకు గురిచేసినట్లు పేర్కొంటూ దళ్ సింగ్ నాయక్ దంపతులు తెలిపారు. తన రాజకీయ భవిష్యత్ కార్యచరణను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. దళ్ సింగ్ నాయక్ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ 1999లో ఆ పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.