సంచలనాల గుకేశ్..
ఎత్త్తుకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను చిత్తు చేసే చదరంగ క్రీడలో భారత్ నుంచి ఎంతో మంది ఆణిముత్యాలు పుట్టుకొచ్చారు. ఇప్పటికీ పుట్టుకొస్తూనే ఉన్నారు. 64 గడుల చెస్‌లో కింగ్ అనిపించుకోవాలనేది ప్రతీ గ్రాండ్‌మాస్టర్ కల. ఒక విశ్వనాథన్ ఆనంద్.. ఒక కోనేరు హంపి.. ఒక ప్రజ్ఞానందను అందించిన మన భారతీయ నేల మరో అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఎంతో మంది భారత గ్రాండ్‌మాస్టర్లకు సాధ్యం కాని ఘనతను అత్యంత పిన్న వయసులోనే సాధించి ఔరా అనిపించాడు 17 ఏళ్ల గుకేశ్. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్ చెస్ టోర్నీ నెగ్గి.. తన గురువు చేత శెభాష్ అనిపించుకున్న సంచలనాల గుకేశ్‌పై ప్రత్యేక కథనం.
విజయక్రాంతి, ఖేల్ విభాగం : 2013లో చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, కార్ల్‌సన్ మధ్య చెన్నైలో జరిగిన బ్లిట్జ్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ హోరాహోరీగా సాగుతుంది. ఈ మ్యాచ్‌కు తన తల్లితో కలిసి హాజరైన ఏడేళ్ల కుర్రాడు ఒక మూలన కూర్చొని వారిద్దరి ఆటను ఆసక్తిగా గమనించాడు. ఆ మ్యాచ్‌లో విజయం ఎవరు సాధించారన్నది పక్కనబెడితే అక్కడికొచ్చిన ఆ కుర్రాడు మాత్రం తాను కూడా ఏదో ఒకరోజు అంతర్జాతీయ చెస్ వేదికపై అంతటి పేరు సంపాదించాలని కలలు కన్నాడు. ఆ కల తీరడానికి ఆ కుర్రాడికి పెద్దగా సమయం పట్టలేదు. ఏడేళ్ల వయసులోనే చెస్‌పై ఆసక్తి పెంచకున్న ఆ కుర్రాడు.. 12 ఏళ్లు వచ్చేసరికి చదరంగంలో గ్రాండ్‌మాస్టర్ హోదాను పొందాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అతని ఎదుగుదల కొనసాగింది. ఆ కుర్రాడే ఇవాళ ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన 17 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్.
ఏడేళ్ల వయసులోనే..
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. గుకేశ్ విషయంలో ఇది అక్షరాలా నిజమనిపిస్తుంది. ఏడేళ్ల వయసులోనే చదరంగం క్రీడపై అమితాసక్తిని పెంచుకున్న గుకేశ్ 64 గడులే తన ప్రాణంగా బతికాడు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చెస్ క్రీడనే తన కలగా భావించాడు. ఉన్నత స్థానాల్లో ఉన్న తల్లిదండ్రులిద్దరు తమ కుమారుడు కూడా అదే బాటలో నడుస్తాడేమోననుకున్నారు. కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి తన కెరీర్‌ను వదులుకుంటే.. వారిద్దరు బాగోగుల చూసుకోవడం కోసం తల్లి కుటుంబ భారాన్ని తన భుజాలకెత్తుకుంది. తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహం, అకుంఠిత దీక్షతో ఇవాళ గుకేశ్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త ఫీట్ ను సాధించి భారత ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశాడు. తమిళనాడుకు చెందిన గుకేశ్ వాస్తవానికి మనోడే. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాకు చెందినవారు.
అమ్మా, నాన్న, ఓ తెలుగబ్బాయి..
ఇక గుకేశ్ విజయాల వెనుక అతని తల్లిదండ్రుల త్యాగం, ప్రోత్సాహం మరువలేనిది. తమ కుమారుడి కెరీర్‌ను తీర్చిదిద్దేందుకు వాళ్ల కెరీర్‌ను పణంగా పెట్టారు. ఈ క్రమంలో ఆర్థిక కష్టాలు వచ్చినప్పటికి క్రౌడ్ ఫండింగ్ నిర్వహించి గుకేశ్ అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు దోహదపడ్డారు. గుకేశ్ తండ్రి రజనీకాంత్ ప్రముఖ ఈఎన్‌టీ నిపుణులు కాగా.. తల్లి పద్మ మైక్రోబయాల జిస్ట్. డాక్టర్ల ఫ్యామిలీ నేపథ్యం నుంచి వచ్చినప్పటికి గుకేశ్ చిన్నప్పటి నుంచే చెస్ ఆటపై అమితాసక్తిని పెంచుకున్నాడు. చెస్‌పై గుకేశ్ ఆసక్తిని గమనించిన తండ్రి రజనీకాంత్.. నాలుగో తరగతి తర్వాత అతని ఫుల్‌టైమ్ స్కూలుకు ఫుల్‌స్టాప్ పెట్టారు.
చెస్ క్రీడాకారుడిగా తమ కుమారుడు రాణించేందుకు తాము ఏం చేయడానికైనా సిద్ధమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గుకేశ్.. 2019 జనవరిలో 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఇక అక్కడినుంచి గుకేశ్‌కు వెనుదిరిగి చూసుకోవా ల్సిన అవసరం రాలేదు. గుకేశ్ తన తొలి మేజర్ టైటిల్‌ను 2018లో సాధించాడు. 2022 ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం.. టీమ్ విభాగంలో కాంస్యం గెలుచుకొని చరిత్ర సృష్టించాడు.
గుకేశ్ సంచలనం
l క్యాండిడేట్ చెస్ టైటిల్ కైవసం
l వరల్డ్ చాంపియన్‌షిప్‌నకు అర్హత
భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ పదిహేడేళ్ల వయసులోనే క్యాండిడేట్ చెస్ టోర్నీ టైటిల్ కైవసం చేసుకొని ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ ప్రదర్శనతో ఈ ఏడాది జరగనున్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌నకు గుకేశ్ అర్హత సాధించాడు.






