7 July, 2026 | 7:18 AM

మార్కెట్ సూపర్ రికవరీ

17-05-2024 12:05 AM

కనిష్ఠస్థాయి నుంచి 1,200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

22,400 పాయింట్లపైకి నిఫ్టీ

ముంబై, మే 16: ఎన్నికల ఫలితాల పట్ల ఆందోళనతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న స్టాక్ మార్కెట్ గురువారం నాటకీయంగా కోలుకున్నది. ట్రేడింగ్ తొలిదశలో 450 పాయింట్లు పడిపోయి  72,529 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరి గంటలో భారీ షార్ట్ కవరింగ్ జరగడంతో ఆ స్థాయి నుంచి వేగంగా 1,200 పాయింట్లు రికవరీ అయ్యి 73,749 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే  677 పాయింట్ల లాభంతో 73,664 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తొలుత 150 పాయింట్లు క్షీణించి 22,055 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పతనమయ్యింది. అటుతర్వాత ఆ స్థాయి నుంచి 370 పాయింట్లు పెరిగి 22,433 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది. చివరకు ఈ సూచి 203 పాయింట్ల లాభంతో 22,404 పాయింట్ల వద్ద నిలిచింది. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు లాభాలతో ముగిసాయి. 

యూఎస్ రేట్ల కోతలపై ఆశలు

యూఎస్‌లో ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం తగ్గిందన్న వార్తలతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుదంటూ నెలకొన్న అంచనాల నడుమ బుధవారం రాత్రి అమెరికా దాదాపు రికార్డు గరిష్ఠాన్ని చేరడంతో గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు ర్యాలీ చేశాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారపార్టీకి మెజారిటీ తగ్గవచ్చన్న ఆందోళనలతో ట్రేడింగ్ ప్రారంభంలో భారత్ సూచీలు పతనమయ్యాయి. కానీ కనిష్ఠ విలువలకు లభిస్తున్న షేర్లకు తాజా కొనుగోళ్ల మద్దతు లభించడం, డెరివేటివ్స్ విభాగంలో షార్ట్ కవరింగ్ జరగడంతో ట్రేడింగ్ ముగింపులో మార్కెట్ కోలుకున్నదని విశ్లేషకులు చెప్పారు. యూఎస్ వినిమయ ద్రవ్యోల్బణం అంచనాలకంటే బాగా తగ్గిందని, ఈ నేపథ్యంలో 2024లో కనీసం రెండు దఫాలు రేట్ల కోతలు ఉంటాయని మార్కెట్ ఆశిస్తున్నట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. 

టాపర్ మహీంద్రా 

తాజా మార్కెట్లో మహీంద్రా గ్రూప్ షేర్లు జోరుగా పెరిగాయి. ప్రోత్సాహకరమైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన మహీంద్రా అండ్ మహీంద్రా సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా 3 శాతంపైగా పెరిగి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి వద్ద ముగిసింది. ఇదే గ్రూప్‌లోని ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా 2 శాతంపైగా ఎగిసింది. భారతి ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, టైటాన్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, లార్సన్ అండ్ టూబ్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు 1 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు మారుతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు 2.5 శాతం వరకూ నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.05 శాతం పెరిగింది. ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.99 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 1.66 శాతం, రియల్టీ ఇండెక్స్ 1.59 శాతం, ఐటీ ఇండెక్స్ 1.55 శాతం, టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 0.99 శాతం చొప్పున పెరిగాయి. యుటిలిటీస్ ఇండెక్స్ నష్టంతో ముగిసింది. స్మాల్ క్యాప్ సూచి 0.85 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.07 శాతం చొప్పున పెరిగాయి.

తగ్గిన ఎఫ్‌పీఐల అమ్మకాలు

స్టాక్ సూచీల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా కొద్ది రోజులుగా వేల కోట్లలో అమ్మకాలు జరుపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) గురువారం మాత్రం వందల కోట్లనే మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు. తాజాగా ఎఫ్‌పీఐలు రూ. 776 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు  స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 9ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి రూ. 33,000 కోట్లకుపైగా వెనక్కు తీసుకున్నారు.