ఎస్బీఐ ఎఫ్‌డీ రేట్ల పెంపు
0.75 శాతం వరకూ పెంచిన బ్యాంక్
న్యూఢిల్లీ, మే 15: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొన్ని కాలపరిమితులకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకూ (0.75 శాతం) పెంచింది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లకు, రూ.2 కోట్లు పైబడిన బల్క్ డిపాజిట్లకు పెంపు వర్తిస్తుంది. కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు 2024 మే 15 నుంచి అమలులోకి వస్తాయని ఎస్బీఐ వెబ్‌సైట్‌లో సమాచారం పొందుపర్చింది.
పెంపు ఇలా..
వివిధ కాలపరిమితుల డిపాజిట్లకు వేరువేరుగా పెరుగుదల ఉన్నది. 46 రోజుల నుంచి 179 రోజులవరకూ చేసే ఎఫ్‌డీలకు వడ్డీ రేటు 4.75 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగింది. ఇదే కాలపరిమితిపై సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ రేటు 5.25 శాతం నుంచి 6 శాతానికి చేరింది. 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీపై సాధారణ పౌరులకు పావు శాతం పెంచి 5.75 శాతం నుంచి 6 శాతానికి చేర్చింది. 211 రోజుల నుంచి 1 ఏడాదిలోపు ఎఫ్‌డీ రేటు సాధారణ పౌరులకు 6 శాతం నుంచి 6.25 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం నుంచి 6.75 శాతానికి పెంచింది.
బల్క్ డిపాజిట్లపై..
రిటైల్ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ డిపాజిట్లపై (రూ.2 కోట్లు పైబడిన డిపాజిట్లు) పెంపుదల శాతం తక్కువగా ఉన్నది. 7 నుంచి 45 రోజుల సాధారణ పౌరులకు ఇచ్చే వడ్డీ రేటును 5 శాతం నుంచి 5.25 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 5.50 శాతం నుంచి 5.75 శాతానికి పెంచింది. 46 రోజుల నుంచి 179 రోజుల డిపాజిట్‌పై 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) పెంచి 5.75 శాతం నుంచి 6.25 శాతానికి చేర్చింది. ఇదే కాలపరిమితిగల బల్క్ ఎఫ్‌డీపై సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం నుంచి 6.75 శాతానికి పెంచింది. 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీపై సాధారణ పౌరులకు రేటును 6.50 శాతం నుంచి 6.60 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 7 శాతం నుంచి 7.10 శాతానికి పెంచింది. ఒక ఏడాది నుంచి రెండేండ్ల మధ్య డిపాజిట్లపై రేటును 6.80 శాతం నుంచి 7 శాతానికి, రెండు నుంచి మూడేండ్ల మధ్య ఎఫ్‌డీపై రేటును 6.75 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. ఇదే కాలపరిమితిగల సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీపై 7.25 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది.






