19 April, 2026 | 2:38 AM

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ పెట్టండి

19-04-2026 12:00 AM
  1. ఉక్కు కొరత తగ్గడంతోపాటు పర్యావరణానికి మేలు
  2. ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్‌రెడ్డి వినతి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): బయ్యారంలో  గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హె చ్‌డీ కుమారస్వామికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతోపాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్‌P 2047 విజన్‌లో భాగంగా రూ పొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతల వల్ల దేశ పారిశ్రామిక ఉ త్పత్తి లక్ష్యాలకు హైదరాబద్ కేంద్రంగా నిలవగలదని కేంద్ర మంత్రులకు వివరించారు.

హైదరాబాద్‌లో హైడ్రోజన్ టెక్నా లజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రం గాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగో ళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పా టు చేయాలని విజ్ఞప్తిచేశారు. మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

హైదరాబాద్‌ను 2034 నాటికి కాలుష్యరహిత నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయస్థాయి సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.