5 August, 2026 | 1:14 AM

సెహత్ సురక్షా పాలసీ తొలి క్లెయిమ్ పరిష్కారం

05-08-2026 12:43 AM

రూ.20 లక్షల బీమా చెక్కు అందుకున్న వీధి వ్యాపారి భార్య

శేరిలింగంపల్లి,ఆగస్టు 4 (విజయక్రాంతి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో అమలవుతున్న సెహత్ సురక్షా పాలసీ కింద దేశంలోనే మొట్టమొదటి రూ.20 లక్షల బీమా క్లెయిం విజయవంతంగా పరిష్కరించబడింది. ఈ చారిత్రాత్మక క్లెయిం ఇండియన్ బ్యాంక్, నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్తో కలిసి సంయుక్తంగా అమలు చేసిన పథకం ద్వారా సాధ్యమైంది.రోడ్డు ప్రమాదంలో మరణించిన వీధి వ్యాపారి, స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ) సభ్యుడు బబ్బూరి రాజు భార్య బబ్బూరి మాధవికి ఈ మొత్తన్ని మంజూరు చేశారు. హైదరాబాద్లోని ఇండియన్ బ్యాంక్ మైక్రోస్టేట్ బ్రాంచ్ ద్వారా ఎస్హెచ్జీ రుణం తీసుకున్న సమయంలోనే రాజు సెహత్ సురక్షా పాలసీ పరిధిలోకి వచ్చారు.

ఆయన అకాల మరణం తర్వాత కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఈ క్లెయిం వేగంగా పరిష్కరించబడింది. మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ (యూసీడీ) వి.వి.ఎల్. సుభద్రా దేవి, ఐఎఫ్‌ఎస్ సమక్షంలో క్లెయిం చెక్కును మాధవికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీఎంసీ, ఇండియన్ బ్యాంక్, నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘ సభ్యులు పాల్గొన్నారు.ఈ క్లెయిం పరిష్కారం స్వయం సహాయక సంఘ సభ్యులకు బీమా రక్షణ ఎంత కీలకమో స్పష్టం చేస్తోంది. అదే సమయంలో ఆర్థిక సమగ్రత, సామాజిక భద్రత, బలహీన వర్గాల కుటుంబాల సంక్షేమం పట్ల సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, భాగస్వామ్య సంస్థలు చూపుతున్న నిబద్ధతకు ఇది ప్రతీకగా నిలుస్తోంది.