17-11-2025 12:33:44 AM
బెంగళూరు, నవంబర్16 : ఆర్థిక సంవత్సరం(మార్చి) ముగిసేలోపు మరో ఏడు ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఇస్రోకు భారీ ప్రణాళికలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాదితో సహా కొన్నేళ్లలో సంస్థ ముందున్న లక్ష్యాలను ఆదివారం ఆయన మీడియాకు వివరించారు.
ఈ సందర్భంగా గగన్‌యాన్, చంద్రయాన్ మిషన్‌లతో పాటు ఇతర ఉపగ్రహాల ప్రయోగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం, పీఎస్‌ఎల్‌వీ, గగన్‌యాన్ మిషన్లు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. దేశీయంగా తయారు చేసిన పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం కూడా ఇందులోనే ఉందని పేర్కొన్నారు.
చంద్రయాన్ ప్రభుత్వం ఆమోద ముద్ర
చంద్రయాన్ మిషన్‌కు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకురావడమే దీని లక్ష్యమని తెలిపారు. 2028నాటికి పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చం ద్రుడి నుంచి మట్టి నమూనాలను సేకరించే సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా కు మాత్రమే ఉందని త్వరలోనే ఇస్రో కూడా ఆ సాంకేతికతను సొంతం చేసుకుంటుందని నారాయణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2035నాటికి సొంత అంతరిక్ష కేంద్రం
జపాన్ అంతరిక్ష కేంద్రం (జేఏఎక్స్‌ఏ)తో కలిసి చేపట్టిన లూపెక్స్ మిషన్ కూడా తమ ప్రణాళికల్లో ఉన్నట్లు నారాయణ్ వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గరి మంచును అధ్యయనం చేయడమే లూపెక్స్ ఉద్దేశమని తెలిపారు. భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిని 2035నాటికి పూర్తి చేయనున్నట్లు తెలపారు.
2028నాటికి ఐదు మ్యాడ్యూల్స్‌ను కక్షలో ఉంచుతున్నామని తెలిపారు. దీంతో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసిన మూడో దేశంగా భారత్ నిలువనుందని తెలిపారు. మిషన్లు డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే మూడేళ్లలో వ్యోమనౌకల వార్షిక ఉత్పత్తిని మూడు రెట్లు పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.
గగన్‌యాన్ టైమ్‌లైన్
మానవరహిత ప్రయోగ మిషన్ల గడువు మారినట్లు నారాయణ్ తెలిపారు. మనుషులతో కూడిన ప్రయోగం ఎప్పటిలాగే 2027నాటికి చేపట్టే ప్రణాళికలో మార్పు లేదన్నారు. భారత వ్యోమగాములతో కూడిన తొలి యాత్రకు ముందు మూడు మానవ రహిత పరీక్ష మిషన్లు జరుగుతాయని తెలిపారు. భారత వ్యోమగాములను చంద్రుడిపైకి పంపి సురక్షితంగా తీసుకొచ్చే కలను 2040నాటికి సాకారం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్లు నారాయణ్ వెల్లడించారు.
ఎకానమీని 2030నాటికి ఎనిమిది శాతానికి పెంచుతాం
ప్రపంచ స్పేస్ ఎకానమీలో రెండు శాతంగా ఉన్న భారత్ వాటాను 2030 నాటికి ఎనిమిది శాతానికి పెంచేందుకు ఇస్రో కృషి చేస్తుందని తెలిపారు. ఇండియన్ స్పేస్ ఎకానమీ విలువ 8.2 మిలియన్ డాలర్లుగా ఉందని ఇది 2033నాటికి 44 బిలియన్ డాలర్లకు పెరుగుతందని అంచనా వేస్తున్నామని తెలిపారు.
ఇదే సమయంలో 630 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ2035నాటికి 1.8 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని నారాయణ అంచనా వేశారు. 2020లో వచ్చిన అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల ప్రైవేట్ భాగస్వామ్యం బాగా పెరిగిందని తెలిపారు. కొన్నేళ్ల క్రితం కేవలం మూడు స్టార్టప్‌లు ఉండగా.. ఇప్పుడు 450 కంపెనీలు, 330 స్టార్టప్‌లు భారత అంతరిక్ష రంగంలో చురుగ్గా పనిచేస్తున్నాయని తెలిపారు.