17-11-2025 09:19:05 AM
సోషల్ మీడియా ముసుగులో అరాచకం
సోషల్ మీడియా రౌడీపాత్ర
హైదరాబాద్: సోషల్ మీడియా ముసుగులో అరాచకం జరుగుతోందని జస్టిస్ రమణ హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రస్తుతం రౌడీ పాత్రను పోషిస్తోందని ఆయన వెల్లడించారు. నియంత్రణ లేని సోషల్ మీడియా ప్రజల వేధింపులకు కారణమవుతోందని పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో(Ramoji Film City) రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో 2 నిఘంటువులను ఆవిష్కరించారు. లక్షా 33 వేల తెలుగు పదాలకు తెలుగులోనే అర్థాలు తెలిపేలా ఒక పదోశం, 86 వేల ఇంగ్లీష్ పదాలకు తెలుగు వచ్చేలా మరో డిక్షనరీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంగ్లీష్- తెలుగు డిక్షనరీని(English-Telugu Dictionary) వెంకయ్య నాయుడు, తెలుగు- తెలుగు నిఘంటువును జస్టిస్ ఎన్.వి. రమణ(Former CJI Justice NV Ramana) ఆవిష్కరించారు. రామోజీ ఫౌండేషన్ చొరవను వెంకయ్య, జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు.
అనంతరం ఎన్.వి. రమణ మాట్లాడుతూ...రామోజీరావు నైతిక నిబద్ధత కలిగిన వ్యక్తి అని జస్టిస్ ఎన్. రమణ పేర్కొన్నారు. పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారని కొనియాడారు. రామోజీరావు(Ramoji Rao ) ఎప్పుడూ తన పత్రికను స్వప్రయోజనాలకు వాడుకోలేదని వివరించారు. పత్రిక ద్వారా దేశాభివృద్ధికి రామోజీరావు కృషి చేశారని, ఎప్పుడూ అధికారాన్ని కోరుకోలేదని ఎన్.వి రమణ పేర్కొన్నారు. పత్రికారంగంలో ఒక దీప స్తంభంగా రామోజీరావు నిలిచారని చెప్పారు. సారా వ్యతిరేక, సమాచార హక్కు ఉద్యమాలను ప్రోత్సహించారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. రామోజీరావు వారసులు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.
1978లో తాను సబ్ ఎడిటర్ గా ఈనాడులో పనిచేసినట్లు జస్టిస్ రమణ గుర్తుచేసుకున్నారు. రామోజీరావు పేరిట నిఘంటువులు ఆవిష్కరించుకోవడం హర్షణీయం అన్నారు. నిఘంటువుల రూపకల్పన కోసం రామోజీరావు తపించారని తెలిపారు. తెలుగుభాషలో మార్పులకు అనుగుణంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు బాష మన సంస్కృతికి మూల స్తంభం అన్నారు. అధికార భాషగా తెలుగు అమలు సరిగ్గా జరగలేదని వివరించారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుభాషను అధికార భాషగా చేశారని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ తర్వాత అధికార భాషగా తెలుగు అమలు సరిగ్గా జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.