135 మందికి కుట్టు మిషన్లు పంపిణీ
గద్వాల, జూలై 22: గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ హాల్లో బుధవారం ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద 135 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. గద్వాల నియోజకవర్గానికి మరిన్ని కుట్టు మిషన్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఒబేదుల్లా కొత్వాల్ త్వరలో మరో 200 కుట్టు మిషన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.






